కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్షను ఖండించండి : ఎస్‌సీకేఎస్‌

– 23న సింగరేణి డే సందర్భంగా నిరసనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణి సంస్థ ‘ఒకే కుటుంబం..ఒకే గమ్యం..ఒకే లక్ష్యం’ నినాదం ఆచరణలో అమలు కావడం లేదనీ, ‘అధికారుల కుటుంబం వేరు..పర్మినెంట్‌ కార్మికుల కుటుంబం వేరు..కాంట్రాక్టు కార్మికుల కుటుంబం వేరు’ అన్నట్టుగా యాజమాన్యం వ్యవహరిస్తోన్నదని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం విమర్శించింది. యాజమాన్యం తీరును ఖండిస్తూ సింగరేణి డే సందర్భంగా ఈ నెల 23న నిరసనలు తెలుపుతున్నట్టు ప్రకటించింది. రెండో తరగతి పౌరులుగా చూస్తూ కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష చూపడాన్ని ఖండించింది. గురువారం ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దూలం శ్రీనివాస్‌, బి.మధు ఒక ప్రకటన విడుదల చేశారు. కోలిండియా వేతనాల అమలు, వైద్య సదుపాయాల కల్పన, క్యాంటీన్‌ సౌకర్యం, పండుగలు, జాతీయ సెలవుల అమలు, ఖాళీ క్వార్టర్స్‌ కేటాయింపు, ఇలా అన్నింటిలోనూ కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని వాపోయారు. వేతనాల పెంపు, చట్టబద్ధ సౌకర్యాల కల్పనపై నిరంతరం పోరాడుతున్నా యాజమాన్యా నికి చీమకుట్టినట్టైనా లేదని విమర్శించారు. 2022లో 18 రోజుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాన్ని సైతం యాజమాన్యం అమలు చేయడం లేదని వాపోయారు. తాము గెలిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పట్ల యాజమాన్యం చూపుతున్న వివక్షను వ్యతిరేకంగా 23న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

Spread the love