స్కూటీలు రాలే.. లూటీలు షురూ

KCR is the leader of BRS– పాత పథకాలే అమలు చేస్తలే..
– ఒట్టు పెట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడే రేవంత్‌ పని
– బీజేపీ.. దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీ
– మత విద్వేషం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే ఆ పార్టీ పని
– మోడీ మళ్లీ వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ‘400 పార్‌’
– తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం కాపాడేది బీఆర్‌ఎస్సే.. : కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
నవతెలంగాణ-కామారెడ్డి
‘అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్‌ కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తే దానికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా..? చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తమన్నారు. స్కూటీలు రాలే కానీ లూటీలు మొదలైయ్యాయి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం రోడ్‌షో, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘9వ తేదీ లోగా రైతుబంధు వేస్తాం అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయనే కుట్ర చేసి, ఎన్నికల కమిషన్‌కు చెప్పి బంద్‌ చేయించిండు’ అని ఆరోపించారు. ”కరెంటు వస్తుందా..? పొలాలు ఎండుతున్నాయి.. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఉన్న కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయింది. మంచినీళ్లు వస్తున్నాయా..? భగీరథతో బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చాం. మరి ఇప్పుడు ఏమైంది. ధాన్యం కొంటున్నారా..? వరికి బోనస్‌ బోగస్‌ అయింది. ఊర్లకు పోవుడు.. ఒట్లు పెట్టుడు కేసీఆర్‌ను తిట్టుడే రేవంత్‌రెడ్డి పని అయింది. పని చేసే సిపాయి ఎక్కడైనా ఒట్టు పెడతాడా..?” అని ప్రశ్నించారు.
అబ్‌కి బార్‌.. పెట్రోల్‌ డీజిల్‌ ‘400 పార్‌’
‘దేశ ప్రధానిగా మోడీ పదేండ్లుగా పని చేసిండు. 150 హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ నెరవేరిందా..? సబ్‌కా వికాస్‌ అంటూ సబ్‌కా సత్యనాశ్‌ చేసిండు. ఎక్స్‌పోర్ట్స్‌ బంద్‌ అయ్యాయి. ఇన్‌పోర్ట్స్‌లు పెరిగాయి. మేకిన్‌ ఇండియా.. డిజిటల్‌ ఇండియా అన్నాడు. ఏమైనా జరిగిందా..?’ అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు జరగలేదని, రూపాయి విలువ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి కృష్ణా, గోదావరి నదుల నీళ్లను ఇతర రాష్ట్రాలకు తరలించుకోవాలని చూస్తోందని చెప్పారు. ‘అబ్‌కి బార్‌ 400 పార్‌ అని మోడీ అంటున్నాడు. ఈసారి మోడీ వస్తే పెట్రోల్‌, డీజిల్‌ 400 పార్‌ అవుతాయి’ అని అన్నారు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీయే తప్ప.. అది పేదల పార్టీ కాదని అన్నారు. తెలంగాణకు ఏనాడూ ఒక్క మంచి పని నరేంద్ర మోడీ చేయలేదని విమర్శించారు. పైగా తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి.. బిడ్డను బతికించారని ఓ దిక్కుమాలిన మాట మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతసేపూ మతవిద్వేషం.. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, గందరగోళం చేసుడే తప్ప.. ఏ ఒక్క మంచి పని ప్రజలకు చేసింది లేదని విమర్శించారు. అందువల్ల బీజేపీకి ఓటు వేసినా వేస్టే అని, ప్రజలకు ఏం లాభం జరగదని అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే రానుందని, బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే కేంద్రంలో కీలకం అవుతామని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం కాపాడేది బీఆర్‌ఎస్సేనని, కాంగ్రెస్‌ ఇచ్చిన పథకాలు మెడలు వంచి అమలు చేసే బాధ్యత బీఆర్‌ఎస్‌ తీసుకుంటుందని అన్నారు. కావునా లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్‌, జాజాల సురేందర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్‌ తదితరులున్నారు.

Spread the love