– ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన వారు 12,053 మంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియలో ఇప్పటి వరకు 12,053 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఈసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకునేందుకు మంగళవారం వరకే గడువుందని తెలిపారు. బుధవారం వరకు ధ్రువపత్రాల పరిశీలనకు గడువుందని పేర్కొన్నారు. ఈనెల నాలుగు వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముంటుందని వివరించారు. ఎనిమిదిన తొలివిడత సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఇప్పటి వరకు 123 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లను నమోదు చేశారని తెలిపారు. పూర్తి వివరాలకు https://tsecet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.