సివిల్‌ సర్వీసుల్లో ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల వెనకబాటు

In civil services Backwardness of SC ST OBCs– అగ్రస్థానానికి చేరుకోలేకపోతున్న వైనం
–  పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో తక్కువ సంఖ్యలో పై వర్గాల అధికారులు
– యూపీఏ నుంచి మోడీ సర్కారు వరకు ఇదే తీరు
– సామాజిక కార్యకర్తల ఆందోళన
దేశంలోనే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌లో అణగారిన, వెనకబడిన వర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరీక్షలు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అగ్రస్థానానికి చేరుకోలేకపోతున్నారు. యూపీఏ హయాం నుంచి ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు వరకు ఇదే తీరు కనిపిస్తున్నది. కాగా ఈ పరిస్థితులపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు సమయంలో రాహుల్‌ గాంధీ ఓబీసీల కోసం ప్రత్యేక కోట అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఉన్నతాధికారుల్లో ఓబీసీ ఆఫీసర్లు ఎంత మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ : భారత్‌లో ఈ ఏడాదిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు కీలకంగా వ్యవహరించనున్నారు. రాజకీయ పార్టీలు సైతం వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఎన్నికల్లో కీలకంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు బ్యూరోక్రసీలో మాత్రం ఎందుకు వెనకబడిపోతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని సైతం వారు తప్పుబడుతున్నారు. భారతదేశంలోని అత్యున్నత బ్యూరోక్రసీలో వైవిధ్యం లేకపోవటం స్పష్టమవుతున్నది. ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లలో సెంట్రల్‌ స్టాఫింగ్‌ స్కీమ్‌ కింద జాయింట్‌ సెక్రెటరీలు, సెక్రెటరీల పోస్టులను కలిగి ఉన్న మొత్తం 322 మంది అధికారులలో ఎస్సీలు 16, ఎస్టీలు 13, ఓబీసీలు 39 మంది, జనరల్‌ కేటగిరీకి చెందినవారు 254 మంది ఉన్నారు. గతేడాది మార్చి నాటికి ప్రభుత్వ సమాచారం ప్రకారం.. 91 మంది అదనపు కార్యదర్శుల్లో ఎస్సీలు పది మంది, ఎస్టీలు నలుగురు, ఓబీసీలు 245 మంది ఉన్నారు. ఇక 245 మంది జాయింట్‌ సెక్రెటరీలలో అధికారుల సంఖ్య ఎస్సీ, ఎస్టీలు కలిపి 26 మంది కాగా.. ఓబీసీలు 29 మంది ఉన్నారు.
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ దేశంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2015 నాటి డేటా ప్రకారం 70 మంది కార్యదర్శులలో ఎస్సీలు ముగ్గురు, ఎస్టీలు ముగ్గురు ఉండగా.. ఓబీసీ అధికారులు ఒక్కరూ లేకపోవటం గమనార్హం. 278 మంది జాయింట్‌ సెక్రటరీలలో ఎస్సీలు 24 మంది, ఎస్టీలు 10 మంది, ఓబీసీలు 10 మంది అధికారులు మాత్రమే ఉన్నారు.
వివిధ కేటగిరీలకు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు పదవీకాలం, వయస్సు ప్రమాణాలలో వ్యత్యాసం ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడిన విభాగం (ఈడబ్ల్యూఎస్‌) కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32. అయితే ఓబీసీలకు ఇది 35 కాగా.. ఎస్సీ, ఎస్టీలకు ఇది 37 ఏండ్లుగా ఉన్నది. అయితే, పరోక్షంగా ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులలో చాలా మందికి తక్కువ సర్వీసుకు కారణమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.

Spread the love