సీన్‌ రివర్స్‌

సీన్‌ రివర్స్‌– బతకడానికి పల్లెబాట
– పొమ్మంటున్న బస్తీలు
– మూడు సంవత్సరాల్లో 5.60 కోట్ల మంది వెనక్కి
న్యూఢిల్లీ: ‘కూటి కోసం, కూలీ కోసం ..పట్టణంలో బతుకుదామని … తల్లిమాటలు చెవిన పెట్టక… బయలుదేరిన బాటసారికి…’ అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన కవిత గుర్తుంది కదూ! ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. పాలకుల విధానాల పుణ్యమా అని బస్తీలు బతుకు నివ్వడం మానేశాయి. దీంతో పొట్ట చేతపట్టుకుని పల్లె బాట పడుతున్న వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. మూడు సంవత్సరాల కాలంలో దేశ వ్యాప్తంగా 5.60 కోట్ల మంది పట్టణాల నుండి పల్లెలకు చేరారు. ఉపాధి కోసం వ్యవసాయాన్ని ఆశ్రయించారు. ఇది దేశ విభజన సమయంలో జరిగిన వలసకల కన్నా ఎక్కువ! ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా ఎంప్లారుమెంట్‌ రిపోర్టు-2024’ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఐఎల్‌ఓతో పాటు, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యుమన్‌ డెవలప్‌మెంట్‌, ఢిల్లీకి చెందిన ఎన్‌జిఓ ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ లేబర్‌ ఎకనామిక్స్‌ కలిసి 2020-2022 కాలానికి ఈ నివేదికను రూపొందించాయి. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేలు, జాతీయ నమూనా సర్వేలు తదితర ప్రభుత్వ గణాంకాలే ఈ నివేదికకు ఆధారంకావడం గమనార్హం.
కరోనాతో ప్రారంభం…
మోడీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా కరోనా సమయంలో వలసకార్మికుల సుదీర్ఘపాదయాత్రలను దేశం చూసింది. నిజానికి పెద్దనోట్ల రద్దు సమయంలోనే కార్పొరేట్ల ఈ వైఖరి కనిపించినప్పటికీ, కరోనా సమయంలో అది మరింత స్పష్టంగా కనిపించింది. నగరాలు, పట్టణాల్లో పట్టించుకునే దిక్కు లేకపోవడంతో కరోనా విజృంభించిన 2020వ సంవత్సరంలో మూడు కోట్ల మందికిపైగా పల్లెలకు చేరినట్లు ఐఎల్‌ఓ తెలిపింది. ఆ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో కార్మికుల సంఖ్య 3.80 కోట్ల మంది పెరిగారు.
కొనసాగిన వలసలు…
ఆ తరువాత కూడా గ్రామాలకు వలసలు కొనసాగాయి. 2021వ సంవత్సరంలో వ్యయసాయ రంగంలో 1.21 కోట్ల మంది కార్మికులు పెరిగారు. 2022లో 1.29 కోట్ల మంది ఇలా పల్లెలకు చేరారు. అంతకుముందు వృద్ధలతో పాటు యువకులు కూడా వ్యవసాయం నుండి బయటకు వచ్చేవారు. 2000-2019 సంవత్సరాల మధ్య ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మళ్లీ పల్లెలో వ్యవసాయ పనుల్లోకి యువత చేరుతున్నట్లు ఐఎల్‌ఓ తెలిపింది. ‘వ్యవసాయ రంగం వెలువల పని అవకాశాలు లేకపోవడం, మహమ్మారి కారణంగా ఆర్థిక మందగమనం కారణంగా ప్రజలు వెనక్కి వెడుతున్నారు’ అని నివేదికలో పేర్కొన్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో కూడా మహిళలు కూడా ఉన్నట్లు ఐఎల్‌ఓ తెలిపింది. ‘2000-2019 కాలంలో శ్రామిక శక్తిలో పురుషుల కంటే మహిళల వాటా తక్కువగా ఉంది. కానీ 2019-2022 మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి తారుమారైంది’ అని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. దీని ప్రకారం ‘పురుషుల కంటే మహిళలు వ్యవసాయరంగంలోకి పెద్ద సంఖ్యలో చేరారు. 2022లో వ్యవసాయంలో పనిచేస్తున్న పురుషుల శాతం 38.1 కాగా, మహిళల సంఖ్య 62.8శాతం’ అని నివేదిక పేర్కొంది. పురుషులు పట్టణాల్లో పనుల కోసం వెతుకుతుంటే మహిళలు గ్రామాలకు చేరి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా ఉపాధి కార్మికులు, నిర్మాణరంగ కార్మికులు పెద్దసంఖ్యలో గ్రామాలకు వచ్చి ఉంటారని ఐఎల్‌ఓ నివేదికలో పేర్కొన్నారు.

Spread the love