వివాదాల సుడిగుండంలో సెబీ చీఫ్‌

Sebi chief in the vortex of controversies– ఆది నుంచీ అన్నీ ఆరోపణలే
– స్వతంత్ర సమీక్ష అవసరమంటున్న అధికారులు
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)… అది స్టాక్‌ మార్కెట్‌ను నియంత్రించే అత్యున్నత సంస్థ. సెక్యూరిటీల్లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, స్టాక్‌ మార్కెట్‌ను నియంత్రించేందుకు, దానిని అభివృద్ధి చేసేందుకు కట్టుబడిన దర్యాప్తు సంస్థ. 2022 ఫిబ్రవరి వరకూ సెబీ బోర్డులో హోల్‌ టైమ్‌ సభ్యురాలిగా ఉన్న మాధబి పురి బచ్‌ను కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థకు అధిపతిని చేసింది. సెక్యూరిటీల మార్కెట్లను నియంత్రించే సంస్థకు సారథ్యం వహించిన తొలి మహిళ ఆమే. మాధబి న్యూఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి గణిత శాస్త్రంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పొందారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో విద్యాభ్యాసం చేశారు. 56 సంవత్సరాల వయసులో సెబీ పగ్గాలు చేపట్టారు. తద్వారా ఆ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుల్లో ఒకరుగా నిలిచారు.
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో, ఆర్థిక సేవల రంగంలో మాధబి బచ్‌కు విశేష అనుభవం ఉంది. ఆమె ఐసీఐసీఐ సెక్యూరిటీలకు ఎండీగా, సీఈఓగా పనిచేశారు. ఈ అనుభవంతో మాధబి బచ్‌ సెబీలో తన హోదాకు వన్నె తెస్తారని, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తారని అందరూ ఆశించారు. ఐసీఐసీఐలో ఉన్నప్పుడు ఎన్‌.వాఘల్‌, కేవీ కామత్‌ల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించారు. షాంఘైకి చెందిన బ్రిక్స్‌ ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు కన్సల్టెంటుగానూ వ్యవహరించారు. దానికి కొంతకాలం కామత్‌ నేతృత్వం వహించారు.
ఏడాది గడవక ముందే…
సెబీ అధిపతిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా గడవక ముందే మాధబి బచ్‌పై ఆరోపణలు మొదలయ్యాయి. అదానీ గ్రూప్‌ కంపెనీలు తమ వాటాల విలువను పెంచి చూపేందుకు అవకతవకలకు పాల్పడ్డాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ ఆరోపించడంతో ఆమెకు కష్టకాలం ప్రారంభమైంది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో అదానీ గ్రూప్‌ కంపెనీల వాటాల విలువ భారీగా పతనమైంది. కొన్ని ట్రేడింగ్‌ సెషన్స్‌లోనే వందల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరై పోయింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు
అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయడంలో సెబీ వైఫల్యంపై కమిటీని ఏర్పాటు చేయాలని గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు విషయంలో సెబీ వైఫల్యం ఏమీ లేదని సుప్రీం నియమించిన కమిటీ తేల్చింది. మేలో తన నివేదికను అందజేసింది.
హిండెన్‌బర్గ్‌ నివేదికలో చూపిన 13 సంస్థల యాజమాన్యంపై సెబీ 2020 అక్టోబర్‌ నుంచే దర్యాప్తులు జరుపుతోందని తెలిపింది. దీంతో వివాదం చల్లారినట్టు కన్పించినప్పటికీ గత నెల 10న హిండెన్‌బర్గ్‌ మరో బాంబు పేల్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి మాధబి బచ్‌పై ఆరోపణలు చేసింది. అదానీలతో సంబంధమున్న మారిషస్‌ ఆఫ్‌షోర్‌ ఫండ్‌లో బచ్‌ పెట్టుబడులు పెట్టారని తెలిపింది. అయితే హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను మాధబి బచ్‌, ఆమె భర్త ధావల్‌ బచ్‌ తోసిపుచ్చారు. ఆ ఆరోపణలలో ఎంతమాత్రం వాస్తవం లేదని, తమ జీవితం, ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకాలేనని వివరించారు. కొన్నేండ్లుగా అవసరమైన అన్ని వివరాలనూ సెబీకి అందజేస్తూనే ఉన్నామని చెప్పారు. ప్రయివేటు పౌరులుగా ఉన్నప్పటి డాక్యుమెంట్లు సహా అన్ని ఆర్థిక పత్రాలనూ ఏ సంస్థకైనా బయటపెట్టేందుకు వెనకడుగు వేయబోమని తెలిపారు.

స్వతంత్ర సమీక్ష అత్యవసరం
సెబీ ప్రయోజనాల కోసం, పెట్టుబడిదారులలో విశ్వాసం నింపడం కోసం మాధబి బచ్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలపై సాధ్యమైనంత త్వరగా స్వతంత్ర సమీక్ష జరిపించి, అపోహలు తొలగించాల్సిన అవసరం ఉన్నదని మాజీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అది ఆమె ప్రయోజనాలకు కూడా మంచిదని అంటూ తన జీవితం తెరచిన పుస్తకం అన్న మాధబి మాటలను ఆయన గుర్తు చేశారు.

తిరగబడుతున్న అధికారులు
అటు సెబీ కూడా ఆగస్టు 11న ఓ ప్రకటన విడుదల చేసింది. సెక్యూరిటీలు, వాటి బదిలీలకు సంబంధించి ఛైర్‌పర్సన్‌ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నారని, పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాల దర్యాప్తు నుంచి ఆమె తనంతట తానుగా వైదొలిగారని చెప్పుకొచ్చింది. సెబీ జరిపిన ఏ దర్యాప్తునూ ప్రభావితం చేసేందుకు బచ్‌ ప్రయత్నించలేదని దాని పనితీరుతో సంబంధమున్న వ్యక్తులు కూడా తెలియజేశారు. అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాలపై సెబీ దర్యాప్తు జరిపినప్పుడు మాధబి బచ్‌ తన బాధ్యతల నుంచి వైదొలగలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని బోర్డు సభ్యుడొకరు స్పష్టం చేశారు. ఇదిలా వుండగా సెబీలో పనిచేస్తున్న పలువురు అధికారులు మాధబి ప్రవర్తనపై మండిపడుతున్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వారు ఉద్యోగులను నమ్మడం లేదని, వారిని గౌరవించరని, పని ప్రదేశంలో విష సంస్కృతి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెబీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రదర్శన కూడా నిర్వహించారు.

Spread the love