– హుజూర్‌నగర్ మల్లు లక్ష్మి.. నల్లగొండ ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
– నేడు కోదాడ అభ్యర్థి ఎంపిక
– మునుగోడు, ఇల్లెందు, కొల్లాపూర్ స్థానాల్లోనూ పోటీపై పరిశీలన
– నిర్ధిష్ట ప్రతిపాదన లేకుండా పొత్తులు కుదరవు
– బాధిత, పీడితుల సమస్యలపై నిలదీసేది కమ్యూనిస్టులే : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ చేస్తానన్న 17 నియోజకవర్గాల్లో ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, మరో ఇద్దరు అభ్యర్థులు ఖరారయ్యారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కోడలు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి.. హుజూర్‌నగర్, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి.. నల్లగొండ స్థానం నుంచి బరిలో ఉంటారని చెప్పారు. మరో స్థానం కోదాడ అభ్యర్థిని మంగళవారం మధ్యాహ్నం లోగా ప్రకటిస్తామన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు, ఇల్లెందు, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీపై నాయకత్వం చర్చలు జరుపుతోంద న్నారు. గతంలో తాము 17 స్థానాల్లోనే పోటీ చేస్తామని ప్రకటించామని, వాటిని 21 స్థానాలకు పెంచాలని నిర్ణయించామన్నారు. ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామన్నారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 9 స్థానాలు గెలిచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అధిక స్థానాలు గెలిచినా ఖమ్మంలో మాత్రం ఏడు నియోజక వర్గాల్లో కమ్యూనిస్టు అభ్యర్థులు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే..
మిగిలిన పార్టీల్లా ఎన్నికలు, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా కమ్యూనిస్టులు నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటారని తమ్మినేని అన్నారు. ఖమ్మం జిల్లా సాగునీటి సమస్య పరిష్కారానికి… దుమ్ముగూడెం సాధన కోసం తాను 2,600 కి.మీ పాదయాత్ర చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా ఖమ్మం అసెంబ్లీ స్థానంలో స్నేహపూర్వక పోటీ ఉన్నట్టు తెలిపారు. సీపీఐ, టీడీపీ కలిసి పోటీ చేసినా ఆ ఎన్నికల్లో తాను గెలుపొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ…పోరాట ఫలితమే ఈ గెలుపు అన్నారు. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హౌదాలో తనను పక్కన పెట్టుకొని దుమ్ముగూడెం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రూ.600 కోట్లు ప్రాజెక్టుకు కేటాయించినా నిధుల మంజూరు జాప్యం కావడంపైనా విపక్షాలతో కలిసి ఆందోళనలు నిర్వహించామన్నారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు డిజైన్లు, పేర్లు మారినా..శంకుస్థాపనలు ఎవరు చేసినా మూలం కమ్యూనిస్టుల పట్టుదలే అన్నారు. జిల్లా సమస్యలు, కోల్‌బెల్ట్, విద్యావైద్యం, పోడుభూములు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే చట్టాలపైనా మాట్లాడేది కేవలం కమ్యూనిస్టులేనని అన్నారు. అందుకే చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాధిత, పీడితుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేది కమ్యూనిస్టు లేనని తెలిపారు. పోడుహక్కు పత్రాలు, ఉపాధి బిల్లు ల ఆమోదం వంటివి కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండటం మూలంగానే సాధ్యమయ్యాయని తెలి పారు. కాబట్టి ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు.
నిర్దిష్టమైన ప్రతిపాదన లేకుండా పొత్తులుండవు…
కాంగ్రెస్ వైపు నుంచి నిర్దిష్టమైన ప్రతిపాదన లేకుండా పొత్తులు కుదరవని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు స్పష్టం చేసినట్టు తమ్మినేని చెప్పారు. ఆదివారం జానారెడ్డి, భట్టిఫోన్ చేశారని తమ్మినేని చెప్పారు. సోమవారం వంశీచందర్‌రెడ్డి ఫోన్ చేసి సీపీఐ కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీకి అంగీకరించిందని, మీరు కూడా అంగీకరించాల్సిందిగా కోరారన్నారు. పరిస్థితులు మారాయని, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు బాధ్యతగా లేదన్నారు. పొత్తుల గురించి సీపీఐ(ఎం) బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల్లో వేటి వద్దకూ తాము వెళ్లలేదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయన్నారు. వామపక్షాలు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాయన్నారు.