తెలుగు రాష్ట్రాలకూ మతోన్మాద ముప్పు!

Telugu To the states The threat of fanaticism!– బీజేపీ గెలుపుతో ఆందోళనలు
– పొరుగు నుంచీ ఉద్రిక్తతల ప్రేరణకు ఆస్కారం
–  అప్రమత్తంగా ఉండాలంటున్న లౌకికవాదులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాలకు ఇంటా బయటా మతోన్మాద ముప్పును తెచ్చిపెట్టాయి. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కట్టగా, వైసీపీ ప్రభుత్వ నిరంకుశ, విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు పొత్తులో పోటీ చేసిన బీజేపీకి కొన్ని చోట్ల ఓటేసి గెలుపునందించారు. ఆ పార్టీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి తొమ్మిది చోట్ల గెలిచింది. ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్ల నెగ్గింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. నోటా కంటే తక్కువగా, ఒక్క శాతం లోపు ఓట్లే బీజేపీకి వచ్చాయి. కూటమి కట్టి ఈమారు ఆ పార్టీ లాభపడింది. రెండున్నర శాతానికిపైగా ఓట్లు తెచ్చుకున్నట్లు ప్రాథమిక సమాచారం. కేంద్రంలో మోడీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకొచ్చాక ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఒక పథకం ప్రకారం దేశ వ్యాప్తంగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు యత్నిస్తోంది. ఏపీలోనూ అటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ బీజేపీ ఎనిమిది సీట్లను కైవసం చేసుకున్నది. ఇప్పటికే ఓడిశాను కమలం గుప్పెట్లోకి తెచ్చుకున్నది. ఎలాగైనా దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ఎత్తులేస్తోంది.
మత భావనల వ్యాప్తి
టీడీపీ హయాంలో విజయవాడలో రోడ్ల విస్తరణలో హిందూ దేవాలయాలను కూలగొట్టారని బీజేపీ పరివారం నానా యాగీ చేసింది. వైసీపీ వచ్చాక అంతర్వేదిలో రథం దగ్ధం హిందూ వ్యతిరేకుల కుట్ర అంటూ సాధు సంతులను పోగేసి గోల చేసింది. రామతీర్థంలో విగ్రహాలు, ఇంకా పలు ప్రదేశాల్లో హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వంటి సంఘటనలపై కృత్రిమ ఆందోళనలను ప్రేరేపించింది. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని వాపోయింది. జగన్‌ క్రైస్తవాన్ని అనుసరిస్తూ హిందువులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. వీలు చిక్కినప్పుడల్లా బీజేపీ, సంఫ్‌ులు ప్రజల్లో మతోన్మాద భావనలను రెచ్చగొ డుతున్నా వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. పైన బీజేపీతో ఉన్న లాలూచీ వల్లనే జగన్‌ సర్కారు మతోన్మాద ప్రేరేపిత చర్యలపై సాచివేతగా ఉందని ఆరోపణలూ వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం హిందూపురంలో హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలను బీజేపీ లేవదీసింది. అప్పుడు కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ సర్కారు ఉంది. అప్పుడు కూడా టీడీపీ ఎన్డీఏలో ఉంది. కదిరిలోనూ గొడవలు జరిగాయి. ఈ పూర్వరంగంలో ఈసారి రాష్ట్రంలో సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఊరికనే ఉండదని, ఏదొక వంకతో ప్రజల మధ్య విద్వేషాలకు ఒడిగడుతుందన్న ఆందోళనలు పౌరసంఘాలు, లౌకిక వాదుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇది చంద్ర బాబు ప్రభుత్వానికి తలనొప్పేనని అభిప్రాయపడుతున్నాయి. అస్సలు బీజేపీ అంటే తెలియని ధర్మవరం, జమ్మలమడుగు అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీ గెలిచింది. బీజేపీ జాతీయ కార్యదర్శి, సంఫ్‌ుతో సంబంధా లున్న సత్యకుమార్‌ ధర్మవరంలో గెలిచారు. అలాగే నర్సాపురం ఎంపీగా గెలిచిన వర్మ సైతం సంఫ్‌ుకు అత్యంత ప్రీతిపాత్రుడని లౌకిక వాదులు గుర్తు చేస్తున్నారు.
పొరుగు నుంచీ…
మరో పొరుగు రాష్ట్రం ఒడిశా కూడా బీజేపీ సీట్లను పెంచుకుంది. ఒడిశాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన బీజేపీ అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి పెరిగింది. ఆ రాష్ట్రంలోని 21 ఎంపీ స్థానాలకుగాను 2019 ఎన్నికల్లో 8 గెలిచిన ఆ పార్టీ, ఇప్పుడు 19 సీట్లకు ఎగబాకింది. తెలంగాణాలో ఒక్క అసెంబ్లీ సీటు ఉన్న బీజేపీ, 2023 ఎన్నికల్లో 8 సీట్లు తెచ్చుకుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అంతే సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలిచింది. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, ఇప్పటి లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 17 గెలిచింది. ఇటు రాష్ట్రం లోపల గతంలో లేని విధంగా ఎంఎల్‌ఎ, ఎంపీ స్థానాలను తెచ్చుకున్న బీజేపీ, పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రాబల్యం చూపింది. ఈ నేపథ్యంలో ఎలాంటి మతోన్మాద జాడలూ లేని తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తలెత్తడానికి ఆస్కారం ఉందని, ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని లౌకిక, ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.

Spread the love