సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్ సీజ్..!

నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి హోటల్ మూయించేశారు. ఈ హోటల్‌పై ఈ నెల 15న కొందరు అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. అంతకుముందు కొద్ది రోజులుగా హోటల్‌లోని అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో హోటల్‌లో తనిఖీలు నిర్వహించి సీజ్ చేసిన అధికారులు అక్కడి శాంపిళ్లను పరీక్షల కోసం నాచారంలోని స్టేట్‌ఫుడ్ లాబ్‌కు పంపించారు. కాగా, ఆదివారం కూడా అధికారులు మరోమారు హోటల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యపూరిత ధోరణి గుర్తించారు. దీంతో, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వారిని హెచ్చరించారు. తదుపరి చర్యలు తీసుకునే వరకూ హోటల్‌ను మూసేశారు. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, ఆపై హోటల్ యాజమాన్యానికి పెనాల్టీ విధిస్తామని పేర్కొన్నారు.

Spread the love