ఇంఫాల్: మణిపూర్‌లోని పౌర సమాజం ‘కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ మణిపూర్ ఇంటెగ్రిటీ (సిఒసిఒఎంఐ – కొకొమి)’ పై దేశద్రోహం, పరువునష్టం కేసులు దాఖలయ్యాయి. అస్సాం రైఫిల్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసులను నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ” ఆయుధాలను అప్పగించవద్దని ” ప్రజలకు పిలుపునివ్వడంతో జులై 10న కొకొమి పై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఐపిసి సెక్షన్ 124 ఎ దేశద్రోహం కింద, సెక్షన్ 153 ఎ ప్రకారం మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించడం కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. చురచంద్‌పూర్ పోలీస్ స్టేషన్లో కొకొమి కన్వీనర్ జితేంద్ర నింగోంబాపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. జూన్ 30న బిష్ణుపూర్‌లోని మొయిరాంగ్‌లో పలువురు మహిళా ఆందోళనకారులపై సైన్యం దాడి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సైన్యం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అస్సాం రైఫిల్స్ స్థానంలో ఏదైనా ఇతర కేంద్ర సాయుధ పోలీసు బలగాలను నియమించాలని డిమాండ్ చేస్తూ కొకొమి జూన్ 4న కేంద్ర హోం మంత్రికి ఒక మెమోరాండం సమర్పించింది. స్థానిక యువకులు ఆయుధాలను సమర్పించేందుకు సిద్ధంగా లేరని పేర్కొంది. వాస్తవానికి జూన్‌లో రాష్ట్ర గవర్నర్ అనుసూయీ ఉయికే నియమించిన శాంతికమిటీలో కొకొమి కూడా ఉంది. అయితే డ్రగ్స్ రవాణా చేసే ఉగ్రవాదులు, మయన్మార్ నుండి వచ్చే అక్రమ వలసదారులపై చర్యలు తీసుకునే వరకు శాంతి కమిటీలో పాల్గొనమని స్పష్టం చేసింది. మే 3న రాష్ట్రంలో హింసాకాండ నెలకొన్న అనంతరం దుండగులు పోలీస్ స్టేషన్ల నుండి 4,000కు పైగా ఆయుధాలను, లక్షల కొద్దీ మందుగుండు సామగ్రిని దోచుకున్న సంగతి తెలిసిందే.