కూల్చివేతలకు ముందు ఆధారాలు చూడండి

See evidence before demolitions– ఖానాపూర్‌లో ఇండ్ల నిర్మాణాల కూల్చివేతను నిలిపేసిన హైకోర్టు
నవతెలంగాణ – హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం ఖానాపూర్‌కు చెందిన ఇండ్ల నిర్మాణాల కూల్చివేత నోటీసుల అమలును నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాధర్‌రెడ్డి మరొకరు దాఖలు చేసిన కేసులో జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మాన్‌ సాగర్‌ పరిధి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ అధికారులు తమ వాదనలు పట్టించుకోకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. పిటిషనర్ల భూములు ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేవని 2015లో అప్పటి అధికారులు నిర్ధారణ చేశారనీ, తాజాగా ఎఫ్‌టీఎల్‌లో ఇండ్లు ఉన్నాయని చెప్పి కూల్చివేత చర్యలు పాక్షికంగా చేపట్టారన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటర్‌ వేయాలనీ, ఉస్మాన్‌ సాగర్‌ మ్యాప్‌ను కూడా కౌంటర్‌లో ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదే తరహాలో దాఖలైన మరో పిటిషన్‌ను కూడా హైకోర్టు సోమవారం విచారించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట ప్రాంతంలో దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయని చెప్పి కూల్చివేత నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేసిన పిటిషన్లను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాథే బెంచ్‌ విచారించింది. కూల్చివేత నోటీసులను షోకాజ్‌ నోటీసులుగా సవరించాలని అధికారులను ఆదేశించింది. షోకాజ్‌ నోటీసులపై పిటిషనర్లు చూపించే ఆధారాలన్నింటినీ లోతుగా పరిశీలించాక తదుపరి చర్యలు ఉండాలని సూచించింది. గుట్టలబేగంపేటలో 15 ఎకరాల్లోని లేఔట్‌లోని ఇండ్ల నిర్మాణదారులకు వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23 కింద డిప్యూటీ కలెక్టర్‌ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. చర్యలు చట్ట ప్రకారమే ఉండాలన్న హైకోర్టు వాటిపై విచారణను మూసేస్తున్నట్టు ప్రకటించింది.
హుస్సేన్‌ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై పిటిషన్‌
హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతంలో హైకోర్టు ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ న్యాయవాది వేణుమాధవ్‌ వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్‌కు నెంబర్‌ ఇచ్చేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ అంశంపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాథే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. మరో వారంలో వినాయక చవితి పండగ ఉందనీ, ఆ తర్వాత నుంచి విగ్రహాల నిమజ్జనం చేస్తారనీ, చివరి సమయం వరకు పిటిషన్‌ వేయకుండా ఏం చేస్తున్నారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. విచారణను వినాయక చవితి తర్వాత ఈనెల తొమ్మిదిన విచారిస్తామని చెప్పింది. ఈలోగా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వబోమని స్పష్టం చేసింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను తదుపరి విచారణ సమయంలో సమీక్ష చేస్తామని వెల్లడించింది.
రవిప్రకాశ్‌పై కేసు ఉపసంహరణ రద్దు చేయండి
ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్ల తయారీ, నిధుల దుర్వినియోగం వంటి క్రిమినల్‌ అభియోగాల కేసులో నిందితుడిగా ఉన్న టీవీ 9 మాజీ సీఈవో/డైరెక్టర్‌ రవిప్రకాశ్‌పై కేసు ఉపసంహరణ ఉత్తర్వులను రద్దు చేయాలని అలందా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పి కౌశిక్‌రావు వేసిన కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం జీవో ద్వారా కేసు ఉపసంహరణ చేయాలందనీ, దీనికి అనుగుణంగా పీపీ కూకట్‌పల్లి మెజిస్ట్రేట్‌ కోర్టులో మెమో దాఖలు చేశారని తెలిపింది. దీని ఆధారంగా మెజిస్ట్రేట్‌ కేసు పూర్వపరాల్లోకి వెళ్లకుండా ఏకపక్షంగా మెమోను ఆమోదించి రవిప్రకాష్‌ ఇతరులపై కేసు ఉపసంహరణకు అనుమతి ఉత్తర్వులు ఇచ్చారని పిటిషనర్‌ వాదన. రవిప్రకాశ్‌, రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ శివాజీ, జె కనకరాజు, జె తేజవర్మ, మహేష్‌ గాంధీ, మూర్తిలకు న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. విచారణ ఈనెల ఐదో తేదీకి వాయిదా వేశారు.
అవి వ్యక్తిగత వ్యాఖ్యలు : స్మితా సబర్వాల్‌
వికలాంగుల గురించి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, స్టేట్‌ ఫైనాన్స్‌ మెంబర్‌ సెక్రటరీ స్మితా సబర్వాల్‌ చేసిన వ్యాఖ్యల ఆధారంగా దాఖలైన పిటిషన్‌కు నెంబర్‌ కేటాయింపు దశలోనే హైకోర్డు డిస్మిస్‌ చేసింది. హైదరాబాద్‌కు చెందిన సోషల్‌ వర్కర్‌ కొప్పుల వసుంధర వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ కొట్టేసింది. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన పూజా ఖేద్కర్‌ నకిలీ సరిఫ్టికేట్‌ ఉదంతం నేపథ్యంలో సబర్వాల్‌ విమానయాన సంస్థ వికలాంగులకు పైలట్‌గా నియమించడం, వైకల్యం ఉన్న సర్జన్‌ను రోగులు నమ్ముతారా, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లు క్షేతస్థాయిలో బాగా తిరగాల్సి ఉంటుందనీ, ఈ సర్వీసులకు వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించడం సబబు కాదని ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని పేర్కొంది.

Spread the love