అభ్య‌ర్థు‌ల ఎంపిక‌లో హ‌స్తం కుస్తీ‌

– వడపోతలో కుదరని ఏకాభిప్రాయం
– ఉమ్మడి జిల్లాలో తేలని అభ్యర్థుల ఎంపిక

– షెడ్యూల్‌ సమీపిస్తున్నా కాంగ్రెస్‌లో గప్‌చుప్‌
– వలసలపైనే దృష్టి

– ప్రజాల్లోకి వెళ్లలేకపోతున్న ఆశావహులు
అభ్యర్థుల ఎంపికలో హస్తం నేతలు కుస్తీ పడుతున్నారు. నోటిఫికేసన్‌ విడుదలయ్యే సమయం సమీపిస్తున్నా కనీసం తొలి జాబితా కూడా ప్రకటించలేదు. అభ్యర్థుల వడపోతలో ఏకాభిప్రాయం కుదరక ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. అభ్యర్థుల ఖారారు కంటే వలసలపైనే ఎక్కువ దృష్టి సారించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రం జనంలోకెళ్లి ప్రచారం చుట్టేస్తున్నారు. పదకొండు స్థానాల్లో కనీసం సగం సీట్లల్లో కూడా ఏకాభిప్రాయం రాలేదంటే కాంగ్రెస్‌ది ఎంత కలహాల కాపురమో అర్థమవుతుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. టికెట్‌ వస్తుందో..? రాదో..? అనే స్పష్టత రాకపోవడంతో ఆశావాహులు సైతం ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి సంస్థాగతంగా పట్టుంది. పేరుగాంచిన నాయకత్వం కూడా ఉంది. మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ ఏఐసీసీ సభ్యులుగా ఉండగా… టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, గీతారెడ్డి లాంటి ఉద్దండులైన నాయకులున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కూడా ఇదే జిల్లా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, యువ నాయకులు సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో క్యాడర్‌ ఐక్యత ఉన్నప్పటికీ లీడర్ల అనైఖ్యతే ప్రధాన సమస్యగా ఉందనేది ఆ పార్టీ శ్రేణులు చెబుతున్న మాట.
కుదరని ఏకాభిప్రాయం
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సగం సీట్లకు ఇద్దరు చొప్పున్నే దరఖాస్తు చేశారు. వారిలో ఒకర్ని ప్రకటిస్తే ప్రజల్లోకెళ్లి వెళ్లి ప్రచారం చేసుకుంటుమాని ఆశావాహులు అభిప్రాయపడుతున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం టికెట్‌ కోసం కాట శ్రీనివాస గౌడ్‌, గాలి అనిల్‌కుమార్‌ ఇద్దరు దరఖాస్తు చేశారు. వీరిలో ఒకర్ని ఎంపిక చేసే విషయంలో సిగపట్లు పడుతున్నారు. వీరిని కాదని బీఆర్‌ఎస్‌ నుంచి ఓ యువ నాయకుల్ని చేర్చుకుని టికెట్‌ ఇవ్వాలని అధిష్టానం పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నారాయణఖేడ్‌లో మాజీ ఎంపీ సురేష్‌ షేట్కర్‌, సంజీవరెడ్డి ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లు ప్రయత్నిస్తున్నారు. వీరిలోనూ ఒకర్ని ఫైనల్‌ చేసే విషయంలో సఖ్యత కుదర్లేదు. ఎస్సీ రిజర్వుడ్‌ జహీరాబాద్‌ టికెట్‌ కోసం మాజీ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు టికెట్‌ ఇవ్వాలని అధిష్టానం చూస్తుండగా స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అందోల్‌లో దామోదర రాజనర్సింహ, ఆయన కూతురు త్రిష దరఖాస్తు చేశారు. ఇద్దరిలో ఎవరు బరిలో దిగేది తేలట్లేదు. సంగారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి, శంకర్‌రెడ్డి, సంగమేశ్వర్‌, ముకీం దరఖాస్తు చేశారు. జగ్గారెడ్డికే అవకాశమున్నా ప్రకటించని పరిస్థితి ఉంది. నర్సాపూర్‌లో గాలి అనిల్‌, ఆకుల రాజిరెడ్డి, అంజనేయులుగౌడ్‌ ఇతరులు పోటీ పడుతున్నారు. మైనంపల్లి హనుమంతారావు, కొడుకు రోహిత్‌రావు కాంగ్రెస్‌లో చేరడంతో మెదక్‌ టికెట్‌ ఇస్తారనే ప్రచారముంది. దీంతో మెదక్‌ డీసీసీ అధ్యక్షులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. మ్యాడం బాలకష్ణ సైతం పోటీ పడుతున్నారు. దుబ్బాకలో చెరుకు శ్రీనివాసరెడ్డి, కత్తి కార్తిక, శ్రావణ్‌కుమార్‌, హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్‌, అలిగిరెడ్డి శ్రావణ్‌రెడ్డి, గజ్వేల్‌లో నర్సారెడ్డి, జశ్వంతరెడ్డి, సిద్దిపేటలో మరికంటి భవాణీరెడ్డి, తాడూరు శ్రీనివాసగౌడ్‌, గూడూరు శ్రీనివాస్‌, మీసం నాగరాజు, దరిపల్లి చంద్రం, వర్మ, హరికృష్ణ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.
వలసలు…వెంటనే అసమ్మతులు
మైనంపల్లి హనుమంతారావు, రోహిత్‌రావులు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీకి బలం చేకూరనుంది. మరో పక్క నష్టం కూడా అంటున్నారు. మెదక్‌లో ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసి టికెట్‌ ఆశిస్తున్న నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు,. మ్యాడం బాలకృష్ణ, కంటారెడ్డి తిరుపతిరెడ్డి మైనంపల్లి కుటుంబానికి సహారించకపోతే కాంగ్రెస్‌కు లాభం కంటే నష్టమే జరుగుతుందనే చర్చ ఉంది. టికెట్‌ రాని పక్షంలో అనుచరులతో చర్చించి తన నిర్ణయం ప్రకటిస్తానని కంటారెడ్డి తిరుపతిరెడ్డి ప్రకటించడంతో మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆయోమయం నెలకొంది. పటాన్‌చెరులో కాట శ్రీనివాస్‌కు కాకుండా బీఆర్‌ఎన్‌ నాయకుడైన నీలం మధుకు అవకాశం ఇస్తే దామోదర రాజనర్సింహ గ్రూపంతా సహాయ నిరాకరణ చేస్తుందనే చర్చ నడుస్తోంది. జహీరాబాద్‌లో చంద్రశేఖర్‌ పట్ల కూడా స్థానికుల వ్యతిరేకత కనిపిస్తుంది. నర్సాపూర్‌లోనూ వలసొచ్చే వాళ్లకే ఇస్తే గాలి అనిల్‌, రాజిరెడ్డి ఏ మేరకు సహాకరిస్తారనేది చూడాలి.
ప్రచారంలో వెనుకంజ
ఈ నెలలో నోటిఫికేషన్‌ రానుంది. బీఆర్‌ఎస్‌ ముందస్తుగానే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలోకి దించింది. కాంగ్రెస్‌ పార్టీలో మొదట్లో ఆడావుడి చేసి తొలి జాబితా ప్రకటిస్తున్నామని చెప్పినా కనీసం ముఖ్య నాయకుల పేర్లు కూడా ప్రకటించలేదు. అందోల్‌లో మాత్రమే తనకే టికెట్‌ అనే ధిమాతో దామోదర్‌ రాజనర్సింహ్మ తన కూతురు త్రిష ద్వారా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పండగలకు వచ్చి పోవడం తప్ప ఎన్నికల క్యాంపెయిన్‌ చేయట్లేదు. మిగతా 9 నియోజకవర్గాల్లో ఆశావాహులెవ్వరూ ప్రజల్లో తిరిగి ప్రచారం చేసుకునే పరిస్థితి లేదు. టికెట్ల కోసం ఢిల్లీ, హైదరాబాద్‌ పెద్దల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.

Spread the love