– రాజకీయాలకతీతంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళితబంధు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేకపోవడంతో పైరవీలు, కమీషన్లకు తావిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. దీంతో అసలైన లబ్దిదారుల ఎంపిక జరగడం లేదని తెలిపింది. ఎమ్మెల్యేల ఒత్తిడి, రాజకీయ కారణాలతో అనర్హులను లబ్దిదారులుగా ఎంపిక చేయడంతో నిజమైన అర్హులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పేర్కొంది. ఈ పథకంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా, లబ్దిదారుల ఎంపికకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించాలనీ, రాజకీయాలకతీతంగా గ్రామసభల ద్వారా వాస్తవ లబ్దిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దళితబంధు రెండో విడతకు ప్రతి నియోజకవర్గం నుంచి 1,100 మందిని ఎంపికచేసి, ఒకొక్కరికి రూ.10 లక్షల చొప్పున పూర్తి సబ్సిడీతో పంపిణీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించిందని వివరించారు. ఈ పథకం లక్ష్యం మంచిదే అయినప్పటికీ, అర్హుల ఎంపిక ప్రక్రియ సక్రమంగా లేదని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో లబ్దిదారుల ఎంపిక జరగాలనే ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లోనే ఎంపిక పూర్తవుతున్నదని తెలిపారు. ఆ జాబితాను కలెక్టర్లకు పంపుతున్నారని పేర్కొన్నారు. పైరవీకారులు ఒక్కో లబ్దిదారుడి నుంచి రూ.మూడు లక్షల వరకు కమీషన్లు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.