‘ఆత్మ’ పరిశీలన

తోరణాలు కట్టి, లైటింగ్‌ లు పెట్టి ముస్తాబు చేసిన ఇంట్లో అంతా సవ్యంగానే ఉంటదని మనం అనుకోలేం. వాస్తవానికి జనాలంతా నమ్మేది ఇంట్లోని హడావిడిని చూసే. వాస్తవం దగ్గరకు వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అవుద్ది. మనిషిని డ్రెస్సింగ్‌ ను బట్టి, అందాన్ని బట్టి లోపలంతా అతను సంతోషంతో ఉన్నాడని అంచనా వేయటం పొరపాటే. మనిషిలో ఆత్మసంతప్తి ఉందా లేదా అన్నది ముఖ్యం. అందుకే కవి నిర్మలారాణి తోట ఆత్మకొక ఇల్లుకావాలని అంటున్నారు.
మనిషిని ఎన్నో కష్టాలు చుట్టుముడతాయి. ఎక్కడో ఓ చోట జీవిత ప్రయాణంలో పట్టుబడతాడు. ‘ఎంత ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష’ అన్న సినారె మాటలు అందుకు నిదర్శనం. అలాంటి సందర్భంలో స్నేహాన్ని కోరుకుంటారు. తోడును కోరుకుంటారు. వాళ్ళ నుండి సంతోషాన్ని పొందాలని ఆరాటపడతారు. ఎంత ప్రయత్నించినా ఆనందం పొందనప్పుడు చీకటే కురుస్తుంది. ఈ విషయాన్ని చెప్పటానికి కవి ప్రయోగించిన ఎత్తుగడ చూద్దాం.
‘భోరున/ కురుస్తొంది చీకటి’
కుండపోత వర్షం కురిసినట్టు చీకటి కురుస్తుందని చెప్పటంలో బాధామయస్థితి కనిపిస్తుంది. చీకటిని కష్టానికి లేదా బాధకు ప్రతీక చేయటం కనిపిస్తుంది. ఈ కవిత అంతా ప్రతీకలతోనే నడిచింది.
బాధలు సహజం. అలాంటప్పుడే అండగా ఉండడానికి స్నేహితులో, బంధువులో, ఆత్మీయులో, కుటుంబ సభ్యుల సహకారమో కావాలనిపిస్తుంది. అందుకోసం వేచిచూస్తాం. అలాంటి సందర్భంలో ఏ మిత్రుడు లేని స్థితి ఉంటే అంతకన్నా దురదష్టం ఏమీ ఉండదు. అందుకోసమని చెట్టులాంటి మనిషి కావాలని కవి చెబుతున్నారు. చెట్టులా ప్రేమను ఇవ్వటం తెలిసిన మనిషి కోసం ఆరాటమంతా. ఇక్కడ ఇంటిమనిషే కావచ్చు. ప్రియుడే కావచ్చు. ఎలా ఆలోచించుకుంటే ఆ వైపుగా కవితా భావం ఒదిగిపోతుంది. ఇది బహుళ పార్శ్వాలున్న కవిత.
కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా కనిపిస్తాయి. మనల్ని ఒక తీరాన్ని చేర్చుతున్నట్టుగా కొంతమంది నటన ఆశ్చర్యపరుస్తుంది. వాళ్ళంతా కవి చెప్పినట్టు చీకటిని వెలిగించే మిణుగురుల్లా కనబడతారు. తీరా వెళ్ళి చూస్తే అంతా శూన్యం. ఉన్న ఆ కాస్త వెలుగును లాగేసుకుంటారు. గొంతుకు మాటలు పెకలివ్వని ఉచ్చు బిగుసుకుంటుంది. స్వేచ్ఛ కరువవుతుంది. ఆంక్షల నీడలో బతకాల్సిన అత్యవసర పరిస్థితిలోకి నెట్టేయబడతారు. అలాంటి దారిదొరకని సందిగ్ధ స్థితిని కవితావాక్యాల్లోకి ఈ కవి పట్టుకొచ్చారు. కవితను చదువుతుంటే తమ స్వీయ అనుభవమా అని పాఠకులు అనుకునేలా చాలా దగ్గరగా ఉంది.
ఇలా సందిగ్ధ స్థితిలో ఎన్నో ఊహలు, ఎన్నో సందేహాలు, ఎన్నో ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
అనుకున్నది ఒకటిగా, జరుగుతున్నది మరొకటిగా ఉంటూ చివరకు మన ఆలోచనే మటుమాయమయ్యేంతగా దీనస్థితిలోకి కూరుకుపోతాం. ఆలోచన చేసే స్థితిలో కూడా ఉండం. అలాంటి స్థితి కేవలం ఒంటరితనంలోనే ఉంటుంది. అన్నీ ఆశలు కోల్పోయి మిగిలిన జీవశ్చవం గూర్చిన విషయాన్ని కవి ఈ వాక్యాల్లో మాట్లాడుతున్నది.
‘పెనుగులాడి పెనుగులాడి
ఎప్పటికో
తెల్లని రక్తపుమడుగులో
ప్రాణం విడుస్తుంది ఆలోచన’
కవి చివర్లో నలుగురు మనుషులు ఉండాలంటున్నారు. మన బాధలను విని ఓదార్చే వారు. మన సంతోషాలలో పాలుపంచుకునేవారు. ఆత్మ అనే ఇల్లులో చెరిగిపోకుండా గూడుకట్టుకున్నవారు. ఇలాంటి వారి కోసమే కదా ఎవరైనా కోరుకునేది. పదికాలాలు కలిసిమెలిసి ఉండే మంచి మనుషుల సాన్నిహిత్యాన్నే కదా ఎవరైనా కోరుకుంటారు. అందుకే కవి ఇల్లు కావాలంటున్నారు. ఏహొ బాధలు చుట్టుముట్టని సంతోషాన్ని కూడగట్టుకున్న దేహపుగూడు కావాలంటున్నారు. చీకట్లను తరిమివేసే కిరణం లాంటి జీవితపు వెలుగు తొంగిచూడాలంటున్నారు. అలాంటి ఇల్లుల నిర్మాణం జరిగితే బాధలకిక చోటుండదు. హింసకు తావుండదు. సమసమానత్వం నరనరాల్లోకి చొచ్చుకెళ్తుంది. కవి ఆత్మకొక ఇల్లు కావాలి అనటం అతిశయోక్తి కాదు. యదార్థం. జీవనపరమార్థం.

– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551

ఇల్లు కావాలి
భోరున/ కురుస్తోంది చీకటి
హోరుగాలికి
ఎటెగిరిపోయిందో గొడుగు
ఒక్కచెట్టూ లేక
నిలువెల్లా తడుస్తున్న శ్వాస
కనిపించని దారిలో ఈదుతూ
అక్కడెక్కడో కొన్ని మిణుగురులు
తలుపు తడుదామంటే
గొంతుకు తాళం!
పెనుగులాడి పెనుగులాడి
ఎప్పటికో
తెల్లని రక్తపు మడుగులో
ప్రాణం విడుస్తుంది ఆలోచన!
ఓ నలుగురు చేతులెయ్యండి
ఆత్మకొక ఇల్లు కావాలిప్పుడు!
– నిర్మలారాణి తోట
(అద్దం నా చిరునామా కాదు
కవితా సంపుటి నుండి)

Spread the love