– శాంతియుతంగా రిజర్వేషన్ సాధించుకుందాం
– లక్ష డప్పులు.. వెయ్యి గొంతుకలతో మన ఆవేదనను చాటుదాం
– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-సిద్దిపేట
సమాజంలో అన్ని వర్గాలు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కోర్టులో ఎస్సీ వర్గీకరణ అవసరమని చెబుతుంటే, మాలలు మాత్రం స్వార్థంతో వర్గీకరణను అడ్డుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో జరిగే మాదిగల సాంస్కృతిక ప్రదర్శన లక్షల డప్పులు.. వేల గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శనివారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వద్దని లగడపాటి అంటే.. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వద్దని వెంకటస్వామి కుటుంబం కోరుతోందని ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు వర్గీకరణకు అనుకూలంగా ఉంటే, మన జాతి మద్దతు ఇచ్చిందని, తరువాత వర్గీకరణ జరిగిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి వర్గీకరణను నిలిపివేసిందన్నారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడంతో ఆయన వద్దకు మనం పోవాల్సి వచ్చిందని, వారికి మద్దతు ఇచ్చామన్నారు.
కానీ నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మాలల ప్రభావం ఎక్కువగా ఉండటంతో వారు వర్గీకరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. మల్లు, వెంకటస్వామి కుటుంబాలు అడ్డు పడుతున్నాయన్నారు. లక్ష డప్పుల ద్వారా మన ఆవేదనను ప్రపంచానికి తెలియజేస్తామంటే, వారు లక్ష బరిసెలు, కర్రలు అంటున్నారని, మనం శాంతియుతంగా అంటే, వారు తొడలు కొడుతున్నారని విమర్శించారు. శాంతియుతంగా వర్గీకరణను సాధించుకుందామన్నారు. తన ఎదుగుదలలో మాదిగల పాత్ర ఎంతో ఉందని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కొంతమందికి భయపడి వర్గీకరణను ఆలస్యం చేస్తున్నారని, అందుకే తాను మరోసారి రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని అన్నారు. తనకు అనేక పార్టీలు పదవులు ఇస్తామని ప్రకటించినా, భవిష్యత్ తరాలకు మూలమైన వర్గీకరణ కోసమే తాను ఈ నల్ల కండువాను విడిచిపెట్టలేదని చెప్పారు. ఫిబ్రవరి 7న ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు రావాలని, మన ఆవేదనను ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముండ్రాతి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, నాయకులు పరశురాములు, శ్రీనివాస్, యాదగిరి, శేఖర్, రమేష్, భాస్కర్, ప్రకాష్, యాదగిరి, రాములు, రాజు, పవన్ కళ్యాణ్, ప్రసాద్, కనకరాజు పాల్గొన్నారు.