– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- తల్లాడ
అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించే వారిని శాసన సభ్యులుగా పంపించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తల్లాడ మండలంలో సోమవారం సత్తుపల్లి నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి విజయాన్ని కాంక్షిస్తూ కలకొడిమ గ్రామంలో నున్నా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక తాను గుడ్డలేనన్నారు, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బిజెపికి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేననీ తెలిపారు. నిజాయితీపరులైన కమ్యూనిస్టులను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. సిపిఎం నాయకులు అసెంబ్లీ, పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని మాచర్ల భారతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాచర్ల భారతి మాట్లాడుతూ తెలంగాణ కమ్యూనిస్టుల కంచుకోట అని, అలాంటి రాష్ట్ర అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రశ్నించే గొంతుకులను చట్ట సభలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు సాగిస్తూ ప్రశ్నించే గొంతుకులైన కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించి చట్టసభలకు పంపాలని కోరారు. సోమవారం మండల పరిధిలోని కేశవాపురం, బస్వాపురం, తల్లాడ తదితర గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల ఇంచార్జ్ మాదినేని రమేష్, అయినాల రామలింగేశ్వరరావు, నల్లబోతు మోహన్‌రావు, శీలం సత్యనారాయణరెడ్డి, శీలం పకీరమ్మ, చల్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.