సీనియర్‌ పాత్రికేయుడు, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎర్రం నర్సింగరావు మృతి

సీనియర్‌ పాత్రికేయుడు, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎర్రం నర్సింగరావు మృతి– తలసాని, కోదండరాం, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎస్‌.వీరయ్య, మందకృష్ణ సహా పలువురి సంతాపం
– టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే ఘన నివాళి
– అంత్యక్రియలు పూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) వ్యవస్థాపక సభ్యుడు, ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎర్రం నర్సింగరావు సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఈనాడు దినపత్రికలో 30 ఏండ్లపాటు సుదీర్ఘంగా సేవలందించిన ఆయన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌, కవాడిగూడ విలేకరిగా వివిధ రాజకీయ పార్టీల నేతలకు, ప్రజా సంఘాల నాయకులకు, జర్నలిస్టులకు సుపరిచితుడు. గతంలో హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌యూజే) అధ్యక్ష, కార్యదర్శిగానూ ఆయన సేవలందించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నర్సింగరావు… తాను అనారోగ్యం నుంచి బయటపడటం లేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న గాంధీనగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నర్సింగరావు భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు భౌతికకాయాన్ని అప్పగించారు. సాయంత్రం బన్సీలాల్‌ పేట్‌లోని హిందూ స్మశాన వాటికలో నర్సింగరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుమారుడు పవన్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నర్సింగరావు మరణ వార్త తెలుసుకున్న రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్‌ కుమార్‌ యాదవ్‌, బిజెపి అభ్యర్థి పూసరాజు, రామకష్ణ మఠం స్వామీజీ భూధమయానంద, శితికంటానందతోపాటు పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు, వివిధ పత్రికల జర్నలిస్టులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.
తీరని లోటు : టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే, రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం
నర్సింగరావు మరణం పాత్రికేయ రంగానికి, పత్రికలకు, జర్నలిస్టులకు తీరని లోటని టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే పేర్కొన్నాయి. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని, కుటుం సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపాయి. నర్సింగరావు మృతిపట్ల టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జీ ఆంజనేయులు, ఎన్‌ఏజే జాతీయ నాయకులు ఎన్‌.కొండయ్య, ఏ అమరయ్య సంతాపం తెలిపారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్‌కు నర్సింగరావు చేసిన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. ఆయన మృదుస్వభావి, స్నేహశీలి, అందరిని కలుపుకుపోయే మనస్థత్వం ఉన్న వ్యక్తి అని చెప్పారు. నర్సింగరావు మరణం ఫెడరేషన్‌కు తీరనిలోటని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ మేరకు సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఫెడరేషన్‌ నాయకులు గుడిగ రఘు, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌, బి.జగదీశ్వర్‌, మాజీ అధ్యక్ష, కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్‌, బివిఎన్‌ పద్మరాజు, నాయకులు నాగవాణి, రాజశేఖర్‌, దామోదర్‌, నవీన్‌, యాదయ్య, భీష్మాచారి, ప్రశాంత్‌, మధుకర్‌ తదితరులు నర్సింగరావు భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి కేఎన్‌ హరి నర్సింగరావు మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రతి ఒక్కరితో స్నేహ సంబంధాలు నెరిపే నర్సింగరావు మరణం పత్రికారంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
నవతెలంగాణ ఎడిటర్‌, న్యూస్‌ ఎడిటర్‌ సంతాపం
నర్సింగరావు మృతి పట్ల నవతెలంగాణ సంపాకులు ఆర్‌.సుధాభాస్కర్‌, న్యూస్‌ ఎడిటర్‌ ఆర్‌.రమేశ్‌ సంతాపం ప్రకటించారు. దీర్ఘకాలికంగా జర్నలిజంలో ఉంటూ పత్రికా రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నర్సింగరావు కుటుంబానికి వారు ప్రగాఢసానుభూతి తెలిపారు.

Spread the love