నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు తమ వైఫల్యం, అసమర్థతలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని సీబీఐ పూర్వ డైరెక్టర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే అధికారులకు ఇది అలవాటేనని ఆయన పేర్కొన్నారు. ‘కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఐటీ సెల్లోని పెయిడ్ ఆర్టిస్టులు దానికి అన్ని రకాల అబద్ధాలూ గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన సోమవారం ట్విటర్లో దుయ్యబట్టారు. ‘రెండు రైల్వే పోలీసు జిల్లాలకు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీసు అదనపు డీజీపీగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. ఎప్పుడు రైలు ప్రమాదం జరిగినా ప్రజల దృష్టి మళ్లించేందుకు, వారి లోపాల్ని, అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుట్ర జరిగిందని చెప్పడం రైల్వే అధికారులకు అలవాటైన ఎత్తుగడే. దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేసరికి ప్రజలు దాన్ని మర్చిపోతారు’ అని ఆయన పేర్కొన్నారు. ఒడిశా రైలు దుర్ఘటనకు మతాన్ని జోడించి చేస్తున్న ప్రచారమనే మాయలో పడవద్దని ప్రజలను ఆయన కోరారు.