విభజన సమస్యలను పరిష్కరించాలి

Separation issues should be resolved– సీఎంల సమావేశాన్ని స్వాగతించిన సీపీఐ(ఎం)
– ఆ గ్రామాలను భద్రాచలంలో కలపాలి
– పోలవరం ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపాలి
– కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పర్యవేక్షణకు ఉన్నతస్థాయి సలహామండలిని నియమించాలి
– సీఎం రేవంత్‌రెడ్డికి తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చించేందుకు శనివారం హైదరాబాద్‌లో సమావేశం కావడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ స్వాగతించింది. ఇరు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని తెలిపింది. అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం లేఖ రాశారు.
– విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిసర గ్రామాలైన పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామాలను భద్రాచలంలో కలిపేలా చర్యలు తీసుకోవాలి.
– భద్రాచలం చుట్టూ ఆంధ్ర ప్రాంతం ఆనుకుని ఉండడం వల్ల కనీసం డంపింగ్‌ యార్డుకు చోటులేదు.
– పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో 900 ఎకరాల రాముడి దేవస్థానం భూములున్నాయి.
– మూడు గ్రామపంచాయతీల పరిధిలో రహదారి సమస్యలను కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు.
– పోలవరం బ్యాక్‌వాటర్‌ సమస్య వల్ల భద్రాచలం, బూర్గంపాడు మండలాలు, ఇతర ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
– విభజన చట్టంలో (ఎ) ఉక్కు ఫ్యాక్టరీ (బి) ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తుకేంద్రం (సి) కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (డి) సింగరేణికి సంబంధించిన అంశాలున్నాయి. ఈ కాలంలో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను కేంద్రం నేరుగా వేలం పెట్టి సింగరేణి సంస్థను దెబ్బతీస్తున్నది. సింగరేణి బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ ఒడిశా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు కేంద్రం ఆంక్షలు పెట్టడం వల్ల ప్రజలపై భారం పడుతున్నది. హైగ్రేడ్‌ ఇనుప ఖనిజం లభ్యత ఉన్నప్పటికీ నేటికీ ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేయలేదు. దీన్ని వెంటనే ప్రారంభించాలి.
– కృష్ణా-గోదావరి నదీజలాలపై చట్ట ప్రకారం రెండు రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుల ఏర్పాటులోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేసింది. ఈ బోర్డుల కార్యకలాపాల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి సలహామండలిని నియమించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వ జల వనరుల శాఖ మంత్రి చైర్మెన్‌గా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండాలి. వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి.
– తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలను కలిపేందుకు రహదారుల నిర్మాణంపై విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఆ పని ఇంకా మొదలుపెట్టలేదు.
– ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటిని పరిష్కరించాలి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అన్ని పక్షాలు, ప్రజల మద్దతును కూడగట్టాలి.

Spread the love