– ఏడుగురు దుర్మరణం
– 31 మందికి తీవ్ర గాయాలు
– మృతులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
అమరావతి : చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 31 మంది గాయపడ్డారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. పోలీసుల కథనం ప్రకారం… బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో బెంగుళూరు నుంచి వైజాగ్ వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటింది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్‌టిసి బస్సును ఢకొీంది.
ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందారు. వారిలో తిరుపతికి చెందిన ఆర్‌టిసి డ్రైవర్ మనోహరన్ (56), తిరుపతి జిల్లా పాకాల మండలం కంభాలమిట్టకు చెందిన ఎస్.విజయమ్మ (53), మహారాష్ట్రకు చెందిన హన్షిక యాదవ్ (6), తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటకు చెందిన బాలరాజు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సోనుకుమార్ (31), చిత్తూరుజిల్లా జిడి నెల్లూరుకు చెందిన శంకర రెడ్డి (48) ఉన్నారు. మరొకరి పేర్లు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వారిలో శివ, రిక్కీ, చిరంజీవి, బాబురెడ్డి, మురళి, అస్మిత్ యాదవ్, పద్మావతి, లావణ్య, అమరనాథ్ ఉన్నారు. పలమనేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పలమనేరు, పూతలపట్టు ఎంఎల్‌ఎలు అమరనాథ్‌రెడ్డి, మురళీమోహన్ పరామర్శించారు.
రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి : సీపీఐ(ఎం)ఏపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారికీ నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.