ఒకప్పుడు డాక్టరంటే ప్రాణాలు కాపాడే దేవుడు. ఆయుష్షు పెంచే మహాత్ముడు. ఇంటిల్లిపాదికీ స్నేహితుడు. పండుగలకి, పబ్బాలకి ఆహ్వానితుడు. మన సంపదలో భాగస్వామి. మన ఆనందంలో సగభాగం. అన్నీ కలిసి మన డాక్టర్ మహోన్నతుడు!
కానీ ఈ మధ్య డాక్టర్లు మనల్ని మోసం చేస్తున్నారేమో, మనకి మాయ మాటలు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారేమో, మన అమాయకత్వాన్ని వాడుకుంటున్నారేమో అనే అనుమానాలు ఎందుకు పీడిస్తున్నాయి? డాక్టర్ ఏమి చెప్పినా మళ్లీ గూగుల్ సెర్చి చేసుకునో, స్నేహితులతో చర్చించో మాత్రమే ఎందుకు నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది?
డాక్టర్లందరూ తాము నమ్మిన హిపోక్రటిస్ ఓత్‌ని మరోమారు గుర్తుచేసుకోవాలి. అలానే, తమకి నిస్వార్థంగా సేవలందించిన మంచి డాక్టర్లని పేషెంట్లు కూడా మరోమారు గుర్తు చేసుకోవాలి. ‘కరోనా’ వంటి మహమ్మార్లు ప్రబలుతున్న కాలంలో నిజమైన సైనికుల్లా పోరాడి ప్రాణాలు కాపాడడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన డాక్టర్లని, ఇతర వైద్య సిబ్బందిని మరచిపోరాదు. సేవలు అందిస్తూ అసువులు బాసిన ఆ అమరులను మరువరాదు.
ఒకప్పుడు బి.సి.రారు వంటి డాక్టర్లు మెండు. ప్రజల పక్షాన ఆలోచించే పంథా ఆనాడు వెల్లివిరిసింది. అందుకే, బి.సి.రారు పుట్టిన తేదీ చనిపోయిన తేదీ (రెండూ ఒకటే) అయిన జులై ఒకటిని మన జాతీయ డాక్టర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి డాక్టర్ తన డిగ్రీ పొందే సమయంలో తీసుకునే ‘హిపోక్రటిక్ ఓత్’ లో ప్రజోపయోగకర ఆచరణ సేవా దృక్పథం, నైతిక విలువలు నొక్కి చెప్పడం జరుగు తుంది. ఆ డాక్టర్ యవ్వనోత్సాహంతో ఆ మాటలకు ఉత్తేజితులై, ప్రజాసేవ వైపు దృష్టి సారిస్తారు. ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచిన తమ గురువులని సదా గుర్తు చేసుకుంటారు. డాక్టర్ కొట్నిస్, డాక్టర్ నార్మన్ బెతూన్‌ల బాటలో నడవాలని ఉవ్విళ్లూరుతారు.
వంద మంది ఔట్ పేషెంట్లు వున్నా ఎంతో ఓపిగ్గా అందరికీ సమాధానం చెప్పి తృప్తి పరిచే డాక్టర్లు ప్రభుత్వాసుపత్రుల్లో కోకొల్లలు వుండేవారు. ఎనిమిదింటికి తమ డ్యూటీ ఆరంభమయితే, ఏడున్నరకే హాజరై, వార్డుల్లో పేషెంట్లని నవ్వుతూ పలుకరించే డాక్టర్లని చూస్తే సగం జబ్బు మాయమైపోయేది. పురుగులు పట్టిన గాయాల్ని సైతం ఓర్పుగా డ్రెస్సింగ్ చేస్తూ, షుగర్ తగ్గించుకోకపోతే జరిగే అనర్థాలను చుట్టుపక్కల పేషెంట్లకు కూడా వివరిస్తూ, తన ఉనికినే ప్రజలకి ఒక అధ్యయన కేంద్రంగా మలిచేవారు. కాలిన గాయాలతో, జీవితేచ్ఛ నశించిపోయిన ఆడపిల్లలకి స్వాంతన పలుకుతూ, వారి గాయాలు మానేవరకు స్వయంగా ఉపశమన చర్యలు చేపడుతూ, వారి ఆత్మ స్థైర్యాన్ని పెంచేవారు. గ్రామాల నుంచి వచ్చే నిరక్ష్యరాస్యులకి సైతం అర్థమయ్యేలా వారి జబ్బులని, వాటి కారణాలని, పర్యవసానాలని వివరించి, వారికి ఆశని కల్పించేవారు. ఏ వయసువారికైనా, ఎలాంటి జబ్బుకైనా మన ‘పెద్దాసుపత్రి’, అందులో నైపుణ్యం గల వైద్యులు వున్నారనే భరోసా ప్రజలకి వుండేది. ఆ డాక్టర్లంటే విపరీతమైన గౌరవం వుండేది. ప్రేమ వుండేది.
అప్పట్లో మంతులు, ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వాసుపత్రుల్లోనే చేరేవారు. అందరితో సమానంగా వైద్యం పొందేవారు. ఆ ఆసుపత్రులు అధ్యయన కేంద్రాలుగా ఎందరో వైద్య విద్యార్థులని ఉన్నత ప్రమాణాలతో తీర్చి దిద్దాయి. అక్కడ పాఠాలు చెప్పిన వైద్యులు వారి ఆచరణ ద్వారా చిరస్మరణీయులుగా మిగిలారు.
అలనాడు బి.సి.రారు లాగా చెప్పుకోదగిన డాక్టర్లు మన తెలుగు నాట కూడా ఎందరో వున్నారు. ఒక్క బొట్టు రక్తం వృధా కాకుండా నిరుపేదలకి సైతం మెరుగైన శస్త్ర చికిత్స అందించిన సర్జన్లు, మిలిటరీలో పనిచేసి వచ్చి, అతి తక్కువ సమయంలో శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను కాపాడగల నేర్పుని ప్రదర్శించిన నిపుణులు, అవసరమైతే వార్డు బారు పనిని కూడా చేయడానికి సిద్ధపడాలని బోధించిన గురువులు; నిరుపేదలకి, సంపన్నులకి ఒకే తాటి మీద వైద్యం చేస్తూ, ఎంతో సమయస్ఫూర్తిని, నైపుణ్యాన్ని ప్రదర్శించిన డాక్టర్లు, పెళ్లి చేసుకుంటే గర్భిణీలకి అన్ని వేళ్లల్లో సేవలు అందించలేమనే భయంతో ఒంటరిగా మిగిలిపోయిన ఎందరో స్త్రీ వైద్య నిపుణులు, అంకిత భావంతో పనిచేసే పిల్లల డాక్టర్లు, క్షయ నివారణలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన మేథావులు, అటు తర్వాత తరంలో కూడా గుండె జబ్బుల్ని, కిడ్నీ వ్యాధుల్ని, శ్వాసకోశ వ్యాధుల్ని, కాన్సర్‌ని, జీర్ణకోశ వ్యాధుల్ని నయం చేస్తూ ఎందరో సూపర్ స్పెషలిస్టులు ప్రభుత్వాసుపత్రుల్ని నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దారు.
కానీ తరువాత కాలంలో పెనుమార్పులు సంభవించాయి. వైద్య రంగంలో పరిశోధన పెరిగింది. కొత్త మందుల్ని కనుగొన్నారు. ఎన్నో వైద్య పరికరాలు, పరిశోధనా విధానాలు, శస్త్ర చికిత్సలు మెరుగుపడ్డాయి. కొత్త పుంతలు తొక్కుతూ మన దేశంలో వైద్యం పరిఢవిల్లింది. కానీ అదే సమయంలో ప్రపంచీకరణ నేపధ్యంలో వచ్చిన మార్పుల్లో భాగంగా వైద్య రంగం సేవా రంగంగా కాక, ఆ అభివృద్ధిని, ముందడుగుని వాడుకునే ఒక వ్యాపార కేంద్రంగా రూపు దిద్దుకునే దౌర్భాగ్యం మరింత అధికంగా చోటు చేసుకుంది.
అలా వైద్యం లాభాలు ఆర్జించి పెట్టే ఒక ‘ఆరోగ్య పరిశ్రమ’గా మారిపోయింది. ఆసుపత్రుల్లో వైద్యులని చేరుకోవాలంటే హెచ్.ఆర్.లను, బిల్ కౌంటర్లను, ఇన్యూరెన్స్ డెస్క్‌లను ముందుగా సందర్శించుకోవాలి. ఒక పక్క ప్రజలకి అందుబాటులో వుండే ప్రభుత్వాసుపత్రులు వున్నాగానీ, మెరుగైన వైద్యం పేరుతో ఆధునీకరణ పేరుతో కార్పొరేట్ వైద్యం పురివిప్పింది. మన ప్రభుత్వాలు ఆరోగ్యం కోసం కేటాయించే బడ్జెట్ పెరగకపోగా క్షీణించిపోతుంటే, చాలామంది వైద్య నిపుణులు, వైద్య విద్యాబోధనని ఎంతో నేర్పుగా, ఉన్నత ప్రమాణాలతో అందించగల డాక్టర్లు సైతం అధిక జీతాల కోసం, ధనార్జన కోసం మెల్లగా కార్పొరేట్ వ్వయస్థలోకి లాగివేయబడ్డారు. ఆ ఆకర్షణ మలితరం విద్యార్థులని కూడా ప్రలోభపెట్టసాగింది. అలా వైద్యరంగంలో క్రమంగా సేవ స్థానంలో ధనం, పలుకుబడి, స్వార్థం చోటు చేసుకోసాగాయి.
దాని పర్యావసానంగా ఒకప్పటి ఫ్యామిలీ డాక్టర్లు కరువయ్యారు. దగ్గినా, తుమ్మినా, చిన్న చిన్న నలతకి సైతం స్పెషలిస్టుల దగ్గరికి పరుగెత్తడం పరిపాటయింది. కానీ కరోనా నేర్పిన గుణపాఠంతో వైద్యరంగం ఉలిక్కిపడింది. డెబ్బయ్యవ దశకంలో ‘ఆల్మా ఆటా’లో ప్రకటించిన ‘అందరికీ ఆరోగ్యం’ అనే నిదానం మళ్లీ కరోనా తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎజెండా మీదకి వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య సేవలు మెరుగుపడాలంటే ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ పెరుగుపడాలని, అప్పుడే ప్రాథమిక వైద్యం విస్తరిస్తుందని అది ప్రకటించింది.
క్యూబాలో ఎప్పటి నుంచో డాక్టర్ నర్సు టీములు కుటుంబాల బాధ్యత తీసుకుంటూ, వారి అన్ని ఆరోగ్య అవసరాలను తీరుస్తున్నారు. కెనడా తదితర దేశాలు కూడా కొంతవరకు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థని అమలు చేస్తున్నారు. సాధారణంగా ఎనభై శాతం వ్యాధులని నైపుణ్యం గల ఫ్యామిలీ డాక్టర్ స్పెషలిస్టులు నయం చేయగలరు. మిగిలిన ఇరవై శాతానికి ఇతర స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం ఆ ఎనభై శాతాన్ని నయం చేయగల వ్యవస్థ బలహీనంగా వుంది. అలానే వ్యాధి నివారణా వ్యవస్థ కూడా పటిష్టంగా లేదు. ఈ రెండు ప్రధాన రంగాల్లో ఎంతో మార్పు తేగల ఫ్యామిలీ డాక్టర్ల అవసరాన్ని మన ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి గానీ, వున్న వ్యవస్థకే ‘ఫ్యామిలీ డాక్టర్’ గా నామకరణం చేస్తూ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎందరో ఫ్యామిలీ మెడిసిన్ నిపుణులు తయారవుతున్నారు. వారిని విస్మరించి యం.బి.బి.ఎస్. డాక్టర్లనే ఫ్యామిలీ డాక్టర్లుగా నియమిస్తున్నారు. అలా కాక, ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్టులని విరివిగా నియమిస్తే వైద్య ఆరోగ్య సేవల్లో గుణాత్మకమైన మార్పుని ఆశించవచ్చు. అలా నియమించి, ప్రాథమిక ఆరోగ్య స్థాయిని మెరుగుపరచవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.
ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నివారణ, వైద్య ఆరోగ్య సమస్యలపై ప్రజలకి అవగాహన కల్పించడం వంటి మౌలికమైన అంశాలపై నైపుణ్యం గల ఫ్యామిలీ డాక్టర్ల సేవలను వినియోగించుకోగలిగితే వైద్యం అంటే కేవలం డబ్బు సంపాదన మార్గం కాదని, అది ఒక సేవారంగమని మరోసారి రుజువవుతుంది. మెడికల్ కాలేజీల్లో ఈ అంశంపై అవగాహన కల్పించే నైతిక బోధన కూడా వుంటే, మరోసారి డాక్టర్లంటే ప్రాణాలు కాపాడే దేవుళ్లనే నమ్మకం ప్రబలుతుంది.
‘మందులు జబ్బులని నయం చేస్తాయి కానీ డాక్టరు మాత్రమే రోగిని నయం చేస్తా’డనే నానుడిని నిజం చేస్తూ డాక్టర్లు మరింత నిజాయితీగా సేవా దృక్పథంతో పని చేయవలసి వుంది. అలాగే, ‘ఒక డాక్టర్ మంచి చేయలేనప్పుడు, అతను చెడు చేయకుండా చూడాలి’ అనే హిపోక్రటిస్ మాటల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. మందుల అవసరం రాకుండా ఎలా జీవించాలో నేర్పించమన్న హిపోక్రటిస్ మాటల్లో రోగ నివారణ అంశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
అందుకే ఈ ‘డాక్టర్స్ డే’ నాడు డాక్టర్లందరూ తాము నమ్మిన హిపోక్రటిస్ ఓత్‌ని మరోమారు గుర్తుచేసుకోవాలి. అలానే, తమకి నిస్వార్థంగా సేవలందించిన మంచి డాక్టర్లని పేషెంట్లు కూడా మరోమారు గుర్తు చేసుకోవాలి. ‘కరోనా’ వంటి మహమ్మార్లు ప్రబలుతున్న కాలంలో నిజమైన సైనికుల్లా పోరాడి ప్రాణాలు కాపాడడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన డాక్టర్లని, ఇతర వైద్య సిబ్బందిని మరచిపోరాదు. సేవలు అందిస్తూ అసువులు బాసిన ఆ అమరులను మరువరాదు.
”నా కన్నీళ్లు ఉబికినప్పుడు నీ భుజాన్ని అందించావు
నేను నొప్పితో గిలగిలలాడినప్పుడు నా మందువయ్యావు
నేను ఎదర్కొన్న విషాదంలో ఒక చిగురుటాశవయ్యావు” అంటూ ఒక పేషెంట్ తన డాక్టర్‌ని కొనియాడడం నిజం.
‘పగిలిన హృదయాలకు, తగిలిన గాయాలకు లేపనం మా డాక్టర్’ అనే రోగుల ప్రశంసలకు డాక్టర్లు దూరం కాకూడదు.
ఈ ‘డాక్టర్స్ డే’ నాడు వైద్యులందరూ తమ ‘హిపోక్రటిక్ ఓత్’ ని మననం చేసుకుంటూ సేవా దృక్పథంతో పనిచేస్తూ, మరోసారి రోగుల హృదయాలని దోచుకోగలిగితే, రోగ నివారణ దిశగా కృషి చేస్తూ, వ్యాధుల భారాన్ని తగ్గించగలిగితే, ప్రభుత్వాలు వైద్య రంగానికి కేటాయింపులు పెంచి ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరచగలిగితే, నిజమైన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పరిఢవిల్లితే, మన దేశంలో ప్రజల ఆరోగ్యం మెరుగుపడి, దిగజారిపోతున్న ప్రమాణాలు మరోసారి మెరుగుపడగలవు. వైద్యం కోసం ప్రజలు ఆర్థికంగా కుంగిపోవడాన్ని అలా నివారించగలం.
మాకు నైతిక విలువలు నేర్పిన మహనీయ డాక్టర్లు.. ఇ.ఎన్.బి.శర్మ, స్వామి, హేమా పరిమి, సుదర్శన్‌రెడ్డి, శ్యామలాంబ, సీతాదేవి, రామయ్య, స్వరాజ్యలక్ష్మి, రంగాచారి, బిపిన్‌సేధి, కె.జె.మూర్తి వంటి ఎందరికో కృతజ్ఞతలు తెలుపుకుంటూ…
(జులై 1 ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే)
– డా|| నళిని
9441426452