– జిజిహెచ్ ను సందర్శించిన న్యూఢిల్లీ ప్రత్యేక కేంద్ర బృందం
నవతెలంగాణ కంఠేశ్వర్
క్షయ వ్యాధిని నిర్మూలించడానికి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన సేవలు అందుబాటులో ఉంచడమైనదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ నుండి ప్రభుత్వ ఆసుపత్రులలో గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ బృందం వచ్చారని తెలిపారు.
గాలి ద్వారా సంక్రమించే వ్యాధులలో ప్రధానంగా క్షయ(టి.బి) ముఖ్యమైనదని, ఇది దగ్గు, జలుబు ద్వారా మాత్రమే కాకుండా అంతర్గత అవయవాల తీవ్రతను బట్టి రావచ్చునని అలాగే రాత్రిపూట చెమటలు, జ్వరం, దీర్ఘకాలిక దగ్గు, ఆకలి మందగించడం, నిద్రలేమి, బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నప్పుడు కూడా క్షయవ్యాధి రావచ్చునని అలాంటి సందర్భంలో పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా క్షయ వ్యాధి ఉన్నవారిలో డ్రగ్ రెసిస్టెన్సీ కారణంగా మళ్లీ పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా వీటన్నింటికీ ఆసుపత్రిలో చికిత్స ఉంటుందని ప్రజలు సరైన అవగాహనతో చికిత్సను చేయించుకోగలరని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 185 క్షయ వ్యాధి నిర్మూలన కేంద్రాలలో నిజామాబాద్ ఒకటని, అందుకే ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జి జి హెచ్ లో క్షయ వ్యాధి నిర్మూలన పై తగిన చర్యల పైన సమీక్ష నిర్వహించామని ఆసుపత్రి సూపర్డెంటెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ తెలిపారు. అన్ని రకాల నియంత్రణ చర్యలను పాటిస్తున్నట్లు , ముఖ్యంగా సిబ్బందికి వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయడం, ప్రతి వారం హెచ్ఐసీసీ (హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ) ద్వారా సమీక్షలు నిర్వహించడం అభినందనీయం జిజిహెచ్ కి విచ్చేస్తున్న రోగులకు క్షయ(టి.బి) పై అవగాహన కల్పించే విధంగా సూచనలను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ పార్థసారథి, డాక్టర్ భరత్ కుమార్, ప్రమోద్ రెడ్డి, జిజిహెచ్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.