– కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యధికంగా పసుపు పండిచే నిజామాబాద్ జిల్లాలోనే బోర్డును ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాతనే కేంద్రం స్పందించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రదేశంకానీ, దానికి అవసరమన బడ్జెట్ ప్రతిపాదన కానీ లేకుండా కేవలం కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించి మాత్రమే వివరాలను గెజిట్‌లో పేర్కొన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసిందని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2019-20 ఏడాదిలో 3.4 లక్షల ఎకరాల్లో పసుపు సాగు కాగా, 2022-23 కొచ్చేసరికి మూడేండ్లలో 56 వేల ఎకరాలకు పడిపోయిందని తెలిపారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక పోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక పోవడం వల్లనే సాగు విస్తీర్ణం తగ్గిందని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ, అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి అవకాశాలు పెంచడానికి ఈ బోర్డు ఉపయోగపడుతుందని వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల లేఖలో కేంద్రాన్ని కోరారు.