– విద్వేషం కాదు ఆత్మీయత ముఖ్యం
– సంత్ సేవాలాల్ ఆరాధన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సేవాలాల్ మార్గం సేవా మార్గమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో సంత్‌సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సేవాలాల్ ఎంచుకున్న భక్తి, విశ్వాసం, నమ్మకమనే వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పని చేయాలని సూచించారు. రేపటి తరానికి సేవాలాల్ సేవలను అందించాలన్నారు. చరిత్ర పునాదుల మీదే మన జాతి నిర్మితమైందని చెప్పారు. సేవాలాల్ ఇచ్చిన శాంతి బోధనలు, సమానత్వం, అహింస స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు. ఆయన చూపిన మార్గంలో బంజారాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. బంజారాలకు సంచార జీవితం నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు సేవాలాల్ అని గుర్తు చేశారు. వారి స్థిర నివాసం కోసం తండాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఐటీడీఏలు ఏర్పాటు కాంగ్రెస్ వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా భట్టి, సీతక్క వివరించారు. గతంలో సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టాయనీ, ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూ.17వేల కోట్లను ఎస్టీ సంక్షేమం కోసం కేటాయించిందని గుర్తు చేశారు. తండాలలో రోడ్ల నిర్మాణం కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. బంజారా భాషను అధికారిక భాషగా గుర్తించేందుకు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఆ అంశాన్ని పేర్కొనే విధంగా ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, విప్ రామచంద్రనాయక్, వ్యవసాయ కమిషన్ సభ్యులు రాములు నాయక్, మాజీ ఎంపీలు రవీందర్ నాయక్, వీ హనుమంతరావు, ఎమ్మెల్యేలు బాలు నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళి నాయక్, కుంభం అనిల్ రెడ్డి, రాందాస్ నాయక్, ఫ్రెండ్స్ సాగర్ రావు, ట్రైకార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, వ్యవసాయ కమిషన్ చైర్మెన్ కోదండ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.