– హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏడు హామీలను ప్రకటించింది. ఈ హామీల్లో ఎంఎస్‌పీకి మద్దతు ధర, కులగణన సర్వే కూడా ఉన్నాయి. మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏడు హామీలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఖర్గేతో పాటు, కాంగ్రెస్ హర్యానా చీఫ్ ఉదరు భాన్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, హర్యానా ఎన్నికల ఏఐసీసీ పరిశీలకులు అశోక్‌గెహ్లాట్, అజరు మాకెన్, ప్రతాప్‌సింగ్ బజ్వాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రటించిన ఈ హామీలకు ‘సాత్ వాదే, పక్కే ఇరాదే’ అనే పేరుపెట్టాం. మేము ప్రకటించిన ఈ హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. అందుకే ఈ హామీలకు ఈ పేరు పెట్టాం’ అని ఆయన అన్నారు. కాగా, మహిళా సాధికారిత కింద గ్యాస్ సిలిండర్ రూ. 500లకే కాంగ్రెస్ ఇవ్వనుంది. ప్రతినెలా 18-60 ఏండ్ల లోపు ఉన్న మహిళలందరికీ రూ. 2000 ఇస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది.
– సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతినెలా రూ.6 వేలు పెన్షన్. అలాగే ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
– 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
– 25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స.
– రైతుల సంక్షేమం కోసం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టపరమైన హామీ.
– కులగణన చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కులగణనలో సర్వేలో క్రిమీ లేయర్ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
– హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5వ తేదీన ఒక దశలో పోలింగ్ జరగనుండగా, 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ, జేజీపీ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.