ఘోర రోడ్డుప్రమాదం… ఏడుగురు మృతి

 

నవతెలంగాణ హైదరాబాద్: మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ  తిరగబడిన ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే… ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయలుదేరింది. ఆరిపాటిదిబ్బలు- చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది ఉండగా డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధు (తాడిమళ్ల)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల వివరాలు 

సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ ఈ ఘటనలో మృతి చెందారు.

Spread the love