నవతెలంగాణ-హైదరాబాద్ : అదుపు తప్పిన సిమెంట్ ట్యాంకర్ ఒక వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులతోపాటు స్కూటీపై వెళ్తూ రెండింటి మధ్య నలిగిన మరో వ్యక్తి కూడా చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మద్వాస్ ప్రాంతంలోని డోల్ గ్రామంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ కలిగిన పెద్ద ట్యాంకర్ వాహనం నియంత్రణ కోల్పోయింది. బొలెరో వాహనాన్ని ఢీకొట్టి దానిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణించిన ఎనిమిది మందిలో ఆరుగురు చనిపోయారు. అలాగే స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తి కూడా సిమెంట్ ట్యాంకర్, బొలెరో వాహనం మధ్య నలిగి మరణించాడు. కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.