పిచ్చికుక్క స్వైర విహారం..ఏడుగురికి గాయాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ పిచ్చికుక్క స్వైర విహారానికి ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గం కొత్తూరు పురపాలిక పరిధి తిమ్మాపూర్ ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాలనీలో బుధవారం రోజున ఓ కుక్క స్వైర విహారం చేస్తూ… కనిపించిన చిన్నారులపై దాడికి తెగబడింది. చిన్నారుల కుటుంబ సభ్యులు కుక్కను తరిమికొట్టగా పారిపోతూ.. దారిలో కనిపించిన మరికొంత మంది పిల్లలపైన దాడి చేసింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను కుటుంబ సభ్యులు షాద్​నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పిల్లలనుమెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు నీలోఫర్​ ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్క ఒక్కసారిగా విజృంభించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇలా అయితే పరిస్థితులు చేయి దాటిపోతున్నామని భావించి.. వీధికుక్కను కర్రలు రాళ్లతో కొట్టగా అది మృతి చెందింది. కుక్కల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

Spread the love