జాతీయ రహదారిపై తెగిన విద్యుత్ తీగలు..తప్పిన పెను ప్రమాదం…

నవతెలంగాణ – విజయవాడ
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా చెన్నై- కోల్​కతా జాతీయ రహదారిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. స్థానికంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆ పనులు జరుగుతున్న సమయంలో క్రేన్‌ తగిలి విద్యుత్‌ తీగలు హైవే పై పడ్డాయి. అటువైపు నుంచి వస్తున్న వాహనదారులు భయాందోళనకు లోనయ్యారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనదారులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ఫైఓవర్ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని వాహనదారులు, స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్య వైఖరితోనే ఈ ఘటన జరిగిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు నిర్మాణ సంస్థ నిర్లక్ష్య వైఖరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనతో హైవేపై ఇరువైపులా ఐదు కిలో మీటర్ల మేర వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది.

Spread the love