– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ సమీపంలోని శేషమ్మగూడెం వద్ద చేపట్టిన సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులను ఏప్రిల్ 25 నాటికి పూర్తిచేయాలని రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, నల్లగొండ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ జె.శ్రీనివాస్, ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటును తనిఖీ చేశారు. 2014లో రూ.38 కోట్లతో ఈ ప్లాంట్ మంజూరు అయిందని, ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడం బాధాకరమని అన్నారు. పట్టణంలో దాదాపు 80 శాతం ఇండ్లు ఎస్టీపీ కనెక్షన్లు కలిగి ఉన్నాయని, ముఖ్యంగా వెంకటేశ్వర కాలనీ, రాఘవేంద్ర కాలనీ లాంటి కాలనీలకు ఎస్టీపీ కనెక్షన్ ఉందని, మిగతా ఇండ్లకు కూడా ఎస్టీపీ కనెక్షన్లు ఇస్తామని మంత్రి చెప్పారు. రానున్న 25, 30 రోజుల్లో ఎస్టీపీ నిర్మాణం పూర్తిచేయాలని మున్సిపల్ ఇంజజినీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పూర్తి చేయడంతోపాటు చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేయాలని, టైల్స్, పెయింటింగ్ వంటి వాటన్నింటినీ ఏర్పాటు చేయాలని చెప్పారు. నర్సప్పగూడ వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మరో ఎస్టీపీ నిర్మాణాన్ని చేపట్టనున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి పనులనూ చేపట్టబోమని స్పష్టం చేశారు. ఎన్జీ కళాశాల మైదానంలో హరితహారం మొక్కలు నాటాలని, ఎవరూ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, చెత్త వేస్తే జరిమానా విధించాలని అధికారులకు సూచించారు. పట్టణంలో ఫ్లైఓవర్లకు పెయింటింగ్ వేయించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌కు చెప్పారు. అనంతరం మంత్రి ఛాయా సోమేశ్వర దేవాలయం వెనుక వైపు ఉన్న డైసింగ్ కుంట రోడ్డును, ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, ఆర్డిఓ అశోక్‌రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.