8, 9 ,10 తేదీలలో సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

– ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అఖిలభారత అధ్యక్షులు వి.పి. సాను
– తెలంగాణ విద్యారంగాన్ని సంక్షోభానికి తీసుకెళ్తున్న బిఆర్ఎస్..
– సమస్యల వలయం ప్రభుత్వ విద్య.
– పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు అభివృద్ధి లేదు.
-ఖాళీలు భర్తీ లేదు -నాణ్యమైన విద్య లేదు.
-పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ విడుదల లేదు.
– గురుకులాలు,సంక్షేమ వసతి గృహాలలో సంక్షేమం కరువు. అద్దె భవనాలు- అరకొర సౌకర్యాలు.
– విద్యారంగ పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు పోరాటాల రూపకల్పనకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీసమావేశాలు.
– విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు
ఆర్ ఎల్.మూర్తి, టి.నాగరాజు
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షోభంలోకి తీసుకెళ్ళిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అభిప్రాయపడుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్నిపరిరక్షించేందుకు,మరింత బలంగా భవిష్యత్ కార్యచరణ రూపకల్పన కోసం, ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు ఈనెల 8వ తేదీ నుండి10 వరకు సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయని. ఈ సమావేశాలలో .భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్ఎల్ .మూర్తి ,టి.నాగరాజు లుతెలిపారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య రంగం పూర్తి సంక్షోభంలోకి పోయిందని పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు సంక్షోభంలో చిక్కుకుని వుందని అన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్య లో 24 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే కేవలం 5609 పోస్టులకు డీఎస్సీ ప్రకటించి ,ఖాళీలు విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలలో 5552 అధ్యాపక పోస్టులు,మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయలేదన్నారు. గురుకులాలు, కెజిబివిలలో ఖాళీలు ఉన్న వాటిని భర్తీకి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఇప్పటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ ఇవ్వలేదని అన్నారు. క్షేత్రస్థాయిలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయని, కనీసం విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు లేవని ఈ కాలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ జాతాలు, పాదయాత్రలు, జీపు జాతాలులో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ యాత్రలు ద్వారా పూర్తిస్థాయిలో సర్వేలు చేశామని ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాయని అన్నారు. త్రాగునీరు,ప్రహరీ గోడలు,కరెంటు, రన్నింగ్ వాటర్, సైకిల్ స్టాండ్స్, రవాణా సౌకర్యం, హస్టల్స్ లాంటి అనేక సమస్యలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ఐ.టి.కి.ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నారు. దానికోసం కంప్యూటర్ విద్య అందిస్తున్నామని చెప్తున్న పాఠశాలలో, కళాశాలలో కనీసం కంప్యూటర్లు లేని దుస్థితి కనిపిస్తున్నది. స్కావెంజర్స్ లేకుండా, మూత్రశాలలు, మధ్యాహ్న భోజనంకు సరైన వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం కనిపిస్తుంది.మన ఊరు, మనబడి ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలు బాగుపడకుండా ఈనిధులను కాంట్రాక్టర్లు దండుకున్నారు.కాంట్రాక్టర్లు బాగు పడ్డారు తప్ప పాఠశాలలు అభివృద్ధి లేదన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామని 2018లో ప్రకటించిన ఇప్పటికి అమలుకు నోచుకోలేదు.ఇంటర్ విద్యలో ఇంకా లెక్చరర్ పోస్టులు పూర్తిస్థాయిలోభర్తీ చేయలేదు. కళాశాలలుభవనాలు శిథిలావస్థకు చేరాయి, లైబ్రరీలు,ఆటస్థలాలు లేవు, సరిపడా మూత్రశాలలు లేక అనేక సమస్యలతోవిద్యార్థులు సతమతమవుతున్నారు. వాటిని ఇప్పటికి పరిష్కారం చేయలేదు.సంక్షేమవసతి గృహాలు,గురుకులాలు కేజీబీవీలలో చాలీ,చాలని అరకొర వసతులతో,అద్దె భవనాలతో నడుస్తున్నాయి.నెలలు గడుస్తున్నా యూనిఫామ్స్, నోట్ బుక్స్, షూ,ఇవ్వలేదు. చలికాలం వస్తున్న, విష జ్వరాల వ్యాప్తి జరుగుతున్న వాటిని నియంత్ర కోసం తగుచర్యలు కూడా తీసుకోవడంలేదు. దుప్పట్లు,బెడ్ షిట్స్ ఇవ్వలేదు. ట్రంక్ పెట్టెలు,ప్లేట్స్, గ్లాసులు ఇవ్వలేదు.సరైన సౌకర్యాలు లేవు. మెస్ చార్జీలు పెంచామని గొప్పగా చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ పెంచిన ధరలు అమలు చేయడం లేదు.ప్రస్తుతం ఇస్తున్న కాస్మోటిక్ చార్జీలు ప్రస్తుత ధరలకు ఏమాత్రం సరిపోవు. వాటిని కూడా పెంచడం లేదు.కేంద్రంలోబిజెపి తీసుకొస్తున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించకుండా, ఈ రాష్ట్రంలోఅమలు చేయలేమని అసెంబ్లీలో తీర్మానం చేయకుండా పరోక్షంగా నూతన విద్యావిధానానికి మద్దతు తెలియజేస్తుంది.విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయమంటే గొప్పలు చెప్పడం తప్ప పట్టింపు లేవన్నారు. నిధులు ఇవ్వకుండా,ఖాళీలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.ప్రభుత్వ యూనివర్శీటీలు నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధి చేయకుండా వారి పార్టీల్లోనూ వ్యక్తులకు చెందిన ప్రైవేటు యూనివర్శీటీలు ఇచ్చి విద్యా వ్యాపారానికి తెర లేపారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేస్తున్నారు. ఈ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్ రూపకల్పన చేయడానికి ఈనెల 8,9,10 తేదీలలో సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ రాష్ట్ర ప్లీనంలో ఈ అంశాలపై చర్చించి భవిష్యత్ పోరాట రూపకల్పన చేస్తామని వారు తెలిపారు. ఈ ప్లీనరీ సమావేశాలను ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు వి.పి సాను హాజరై ప్రారంభిస్తారని, మొదటి రోజు 8వ తేదీ సంగారెడ్డిలో భారీ విద్యార్థి ప్రదర్శన,బహిరంగ సభ జరుగుతుందని రెండవ రోజు 9వ తేదీన రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులతో ప్రతినిధుల సభ జరుగుతుందని ,మూడవరోజు10వ తేదీన భవిష్యత్ పోరాట రూపకల్పన చేసి ఆమోదం తీసుకోని ప్లీనరీ సమావేశాలు ముగింపు చేస్తామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమాన్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love