– ఉత్తర్వులు జారీ చేసిన వీసీ
– ఇది ఆప్రజాస్వామికం, నిరంకుశత్వానికి నిదర్శనం : యూనివర్సిటీ విద్యార్థి నేతలు
నవతెలంగాణ-మియాపూర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీలో పది మంది ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ వీసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం విద్యార్ధులను ఆగ్రహానికి గురిచేసింది. ఇటీవల హెచ్‌సీయూలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనపై యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థులపై కేసు నమోదు చేశారు. దాంతో వీసీ ఇంటి ఎదుట ధర్నా చేసిన కారణంగా పది మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్టు వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షులు అతిక్ హమద్, నాయకులు కృప మారియా, మోహిత్, సోయల్ అహ్మద్, హసికను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సుభాషిని, నికిత్, రిషికేష్, పంకజ్, అజయ్ ని ఆరు నెలలు సస్పెన్షన్ చేయడంతో పాటు రూ.10వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు కృప జార్జ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలపై ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేసిన తమపై సస్పెన్షన్ వేటు వేయడం నిరంకుశత్వానికి నిదర్శన మని అన్నారు. గతంలోనూ ఇలాంటివే జరిగినట్టు గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు విద్యార్ధుల సస్పెన్షన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పెద్దఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.