‘షా’ రొస్తారా..!

ఇప్పటికే రెండుసార్లు కేంద్రహౌం మంత్రి పర్యటన రద్దు
– మూడోసారి కచ్చితంగా వస్తారని బీజేపీ శ్రేణుల విశ్వాసం
– చివరి నిమిషంలో భద్రాచలం పర్యటన క్యాన్సిల్‌..
– రైతుగోస.. బీజేపీ భరోసా సభకు సవాల్‌గా మారిన జనం తరలింపు..
– రైతుగోసకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమంటున్న అన్నదాతలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌షా ఖమ్మం పర్యటన ఎట్టకేలకు ఖరారయింది. ఇప్పటికే రెండుసార్లు సభ వాయిదా పడటంతో బీజేపీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుని ఉంది. ఈసారి రాకపోతే శ్రేణుల విశ్వాసం కోల్పోతామని స్థానిక నాయకత్వం ఒత్తిడి తేవడంతో పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేకపోయినా హౌం మంత్రి పర్యటనకు సుముఖత వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించే ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ బహిరంగసభకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా శనివారం విడుదల చేశారు. ఇప్పటికే ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ సమీక్ష నిర్వహించారు. హౌంమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. హెలిపాడ్‌, బహిరంగసభా స్థలిని సందర్శించారు. హౌంమంత్రి విమానం, హెలికాప్టర్‌ ద్వారా ప్రయాణం చేసి సభకు వస్తారు కాబట్టి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే మరోసారి సభ వాయిదా పడినా ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు. మరోవైపు మూడురోజుల క్రితం విడుదల చేసిన షెడ్యూల్‌లో భద్రాద్రి జిల్లా పర్యటన సైతం ఉంది. భద్రాద్రి రాముని విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వివక్షతపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో చివరి నిమిషయంలో భద్రాద్రి జిల్లా పర్యటనను హౌం మంత్రి రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
షెడ్యూల్‌ సరే.. సక్సెస్‌ ఎలా..?
కేంద్ర హౌంమంత్రి పర్యటన తాజా షెడ్యూల్‌ శనివారం సాయంత్రం విడుదలైంది. కానీ సభ సక్సెస్‌ ఎలా.. అనే సందేహాలు ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను తొలిచి వేస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10.35 గంటలకు ఢిల్లీ నుంచి ఇండియన్‌ ఆర్మీ ఫోర్స్‌ విమానంలో మధ్యాహ్నం 2.50 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి బీఎస్‌ఎఫ్‌ హెలికాప్టర్‌లో 2.55 గంటలకు బయలుదేరి 3.25 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 3.45 గంటల నుంచి 4.35 గంటల వరకు బహిరంగసభలో ఉంటారు. ఆ తర్వాత 4.40 నుంచి 5.30 వరకు పార్టీ పరమైన మీటింగ్‌లో పాల్గొని సాయంత్రం 6.20 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మొత్తమ్మీద వచ్చామా.. పోయామా.. అనే రీతిలో సాగే అమిత్‌షా పర్యటన, సభను సక్సెస్‌ చేసేందుకు బీజేపీ శ్రేణులు నానా తంటాలు పడుతున్నారు. ఏర్పాట్లు ఘనంగా ఉన్నా ఉభయ జిల్లాల నుంచి పేరేన్నికున్న నేతలు ఎవరూ లేకపోవడంతో సభ సక్సెస్‌కు జనం తరలింపు ఎలా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. సూర్యాపేట, మహబూబాబాద్‌, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని సరిహద్దు గ్రామాల నుంచి కూడా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానికంగా వచ్చేవారికి బిర్యానీ, రూ.200-300 వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
చివరి నిమిషంలో భద్రాద్రి పర్యటన రద్దు
మూడు రోజుల క్రితం ఖరారు అయిన షెడ్యూల్‌లో ఖమ్మం సభ అనంతరం భద్రాచలం వెళ్తారని ప్రకటించారు. కానీ శనివారం విడుదల చేసిన షెడ్యూల్‌లో భద్రాద్రి ఆలయ దర్శనాన్ని రద్దు చేశారు. భద్రాద్రి ఆలయం, భద్రాచలం పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలవరం ఎత్తు పెంచడంతో బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో కొద్దిపాటి వర్షం వచ్చినా భద్రాచలం, బూర్గంపాడు తదితర మండలాలు ముంపునకు గురవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు భద్రాచలం ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాయి. భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఏపీలోకి వెళ్లడంతో భద్రాచలం ఛిన్నాభిన్న మైంది. సమీపంలోని ఐదు పంచాయతీలు గుండాల, పురుషోత్తపట్టణం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, ఎటపాక సైతం ఏపీలోకి వెళ్లడంతో కనీసం చెత్త డంపింగ్‌కు కూడా భద్రాచలంలో చోటులేకుండా పోయింది. పురుషోత్తపట్టణంలోని 900 ఎకరాల భూమి శ్రీరామునికి దక్కుతుంది. రాముని పేరు చెప్పి రాజకీయం చేసే బీజేపీ భద్రాద్రి రామున్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్లలో భద్రాచలం అభివృద్ధికి చేసిన ఏ ఒక్క చిన్నపని కూడా లేకపోగా.. భద్రాద్రిని చిన్నాభిన్నం చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉందన్న సమాచారంతోనే అమిత్‌షా భద్రాచలం టెంపుల్‌ దర్శనాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసా పేరుతో నిర్వహిస్తున్న సభపైనా విమర్శలు వస్తున్నాయి. రైతు గోస పట్టని బీజేపీకి అన్నదాత గురించి మాట్లాడే అర్హత లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Spread the love