హసన్ రాజా మాజీ క్రికెటర్ అంటే నమ్మలేకపోతున్నా: షమీ

నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజాకు భారత పేసర్ మహ్మద్ షమీ కౌంటర్ ఇచ్చాడు. మ్యాచ్ లో జట్లకు బంతులను ఎలా కేటాయిస్తారనే విషయం కూడా హసన్ కు తెలియదని ఎద్దేవా చేశాడు. ఈ చిన్న విషయం కూడా తెలియని వ్యక్తి పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారంటే నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాగే మాట్లాడితే హసన్ ను చూసి జనాలు నవ్వుకుంటారని చెప్పాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లలో భారత జట్టుకు ఐసీసీ వేరే సెట్ బంతులను అందించిందని హసన్ రాజా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పాక్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా స్పందించాడు. హసన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. మ్యాచ్ లలో జట్లకు బంతులను కేటాయించే విధానం, బౌలర్లు వాటిని ఎంచుకునే తీరుపై వివరణ ఇచ్చాడు. తాజాగా మహ్మద్ షమీ కూడా హసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ప్రపంచ కప్ లో భాగంగా తాను ఆడిన మొదటి మ్యాచ్ లో ఐదు వికెట్లు, రెండో మ్యాచ్ లో నాలుగు, ఆ తర్వాతి మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసినట్లు షమీ వివరించాడు. దీనిని పాకిస్థాన్ కు చెందిన కొంతమంది ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించాడు. బంతి రంగుపై, ఐసీసీ తీరుపై హసన్ చేసిన ఆరోపణలు అర్థరహితమని కొట్టి పారేశాడు. హసన్ రాజా తన ఆలోచనలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని షమీ చెప్పాడు.

Spread the love