ప్రధాని ప్రచార తీరుపై శరద్‌ పవార్‌ విమర్శలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని  ప్రచార తీరుపై ఎన్సీపీ-ఎస్‌పీ అధినేత శరద్‌ పవార్‌ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా.. కేవలం ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమవుతున్నారన్నారు. ఆదివారం ఆయన జలగావ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రులు ఎన్నికల ప్రచారంలో దేశ భవిష్యత్తుపై తమ విజన్‌ ఏంటో చెప్పేవారని పవార్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ, మోడీ మాత్రం తనదైన వాక్చాతుర్యంతో ప్రజల్ని ప్రభావితం చేసేందుకు వ్యక్తిగత దాడులు, కాంగ్రెస్‌ను నిందించడంతోనే సరిపోతుంది తప్ప.. దేశ సమస్యలపై మాట్లాడట్లేదని ఆక్షేపించారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం లేదని పవార్‌ విమర్శించారు. గాంధీ-నెహ్రూ భావజాలంతో జలగావ్‌ గుర్తింపు పొందిందని, అయితే, గత కొన్నేళ్లుగా కొన్ని అంశాల్లో మార్పు వచ్చిందని తెలిపారు.

Spread the love