మా గెలుపు కోసం ప్రచారం చేసిన మోడీకి ధన్యవాదాలు : శరద్ పవార్

నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడెక్కడైతే ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించారు అక్కడ… తమ కూటమి మహా వికాస్ అఘాడీ విజయం సాధించిందని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. తమ కూటమిని అత్యధిక స్థానాల్లో గెలిపించినందుకు ప్రధానికి థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర తమ కూటమికి మద్దతిచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, పృథ్వీరాజ్ చవాన్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ… ప్రధాని రోడ్డు షో నిర్వహించిన ప్రతిచోట తాము గెలిచామన్నారు. అందుకే ప్రజలతో పాటు ప్రధానికీ థ్యాంక్స్ చెప్పడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. ‘మా గెలుపు కోసం ప్రచారం చేసిన మోడీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కూటమి గెలుపునకు ఇది ఆరంభమేనని… అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Spread the love