నవతెలంగాణ పెద్దవంగర: విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరు సన్మార్గంలో నడవాలని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు తంగళ్ళపల్లి మల్లికార్జున చారి అన్నారు. ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు బోగోజు భద్రయ్య చారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శర్మ హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని తెలిపారు. కమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, శిల్ప, కంచరి వంటి వివిధ వృత్తులను సృష్టించి, సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసుకునేందుకు ఆయన చేసిన సేవల పట్ల విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయం అన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బోగోజు రత్నవిలాచారి, బోగోజు కాంతా చారి, బోగోజు వేదాచారి, యాకేశ్వరాచారి, పోలోజు సోమ బ్రహ్మచారి, తేలుకుంట్ల సోమయ్య చారి, తేలుకుంట్ల నరేందర్, తేలుకుంట్ల సతీష్, రామగిరి రాము తదితరులు పాల్గొన్నారు.