– వైసిపి నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని
అమరావతి : జగన్‌కు ఉన్నవన్నీ ఆయన సొంత ఆస్తులని, వాటిల్లో షర్మిల వాటాదారు కాదని వైసిసి ప్రధాన కార్యదర్శి వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం వైసిపి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి ఆయన మాట్లాడారు. షర్మిల వాటాను వైఎస్‌ఆర్ కూడా కోరుకోలేదని, జగనే ఆ కంపెనీలన్నీ ప్రారంభించారని పేర్కొ న్నారు. హైకోర్టు స్టేటస్ కో ఉన్నా షర్మిల పేర్లు మార్చుకున్నారని చెప్పారు. దీనివల్లే జగన్ ఎన్‌సిఎల్‌టిని ఆశ్రయించారని చెప్పారు. అంతే తప్ప ఆస్తుల కోసం కాదని అన్నారు. నిజంగా షర్మిల షేర్ హోల్డరైతే ఆమెపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కేవలం జగన్‌పైనే కేసుపెట్టి జైలుకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. జగన్ పదేళ్లలో ఇచ్చిన రూ.200 కోట్లు డివిడెండ్ కాదని, షేర్ హోల్డర్ కానప్పుడు డివిడెండ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చెల్లెలిపై అభిమానం, ప్రేమతో ఆయన సాయం చేశారని అన్నారు. జగన్ కంపెనీల్లో షర్మిల వాటాదారు అయితే ఆమె పేరు ఎందుకు పెట్టలేదని, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ అని ఎందుకు పెట్టారని తెలిపారు. తాను చెల్లెలికి ఇస్తోంది స్వార్జిత ఆస్తి అని అగ్రిమెంటులోనూ పెట్టారని చెప్పారు. అది చదివాకే విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారని, అలాంటప్పుడు షర్మిల కంపెనీలో ఎలా వాటాదారు అవుతారని ప్రశ్నించారు.