– జోరందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం
– ప్రధాన పార్టీల అభ్యర్థుల స్థాయిలోనే స్వతంత్రుల క్యాంపెయిన్
– సోషల్‌మీడియాలో విమర్శ, ప్రతి విమర్శలతో హోరు
– గ్రూప్ ఫోన్‌కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లతోనూ ఓటర్లకు చేరువగా..
– పార్టీ కేడర్లతో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రధాన పార్టీల సమావేశాలు
– నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశాలు, సభలు
– అన్నీ తానై ప్రచారపర్వాన్ని సాగిస్తున్న ‘బండి’
– ప్రజా, విద్యార్థి, ఉద్యోగ సంఘాలతో స్వతంత్రుల మీటింగ్స్
– ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఉపాధ్యాయ అభ్యర్థుల క్యాంపెయిన్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సెగ్మెంట్‌కు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రధాన పార్టీలో నేతలంతా సభలు, సమావేశాలతో ఆయా ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాలకు చేరువవుతుంటే.. అదేస్థాయిలో స్వతంత్రులు సైతం కలుస్తున్నారు. అధికార కాంగ్రెస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలపైనే పార్టీ అధిష్టానం బాధ్యత పెట్టగా.. వారంతా పోటాపోటీగానే క్యాంపెయిన్ చేస్తున్నారు. బీజేపీలో మాత్రం అన్నీ తానై ప్రచారంలోకి దిగిన ‘బండి’.. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలకే పరిమితం అవుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే సోషల్ మీడియాను సాధ్యమైనంత వరకూ వినియోగించు కుంటున్నారు. వ్యక్తిగత వాయిస్, పోస్టర్లతో హోరెత్తిస్తూనే ప్రత్యర్థుల వ్యక్తిగత బలహీనతలపైనా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మాత్రం ఎన్నికల నిబంధనల మేరకు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఉపాధ్యాయులను కలుస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దూరంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయినప్పటికీ ఆ రెండు పార్టీల అభ్యర్థులతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో ఉన్న 56 మందిలో ముగ్గురు, నలుగురు స్వతంత్రులూ బలంగానే ప్రచారంలోకి దిగారు. అధికారపార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి, ‘కమలం’ అభ్యర్థి అంజిరెడ్డికి దీటుగానే స్వతంత్రులుగా పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ, యాదగిరి శేఖర్‌రావు, సర్దార్ రవీందర్‌సింగ్ తమ ప్రభావం ఉన్న సంఘాలు, ప్రాంతాల్లో పెద్దఎత్తునే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరంతా ప్రధానంగా సామాజిక మాధ్యమాలనే సాధనాలుగా చేసుకొని పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అందులోనూ ప్రత్యర్థిపై వ్యతిరేక ప్రచారం చేసేందుకు కొన్ని ఏజెన్సీలతో రూ. కోట్ల వ్యయాన్ని వెచ్చించి బేరం కుదుర్చుకున్నారనే విమర్శలు ఆయా అభ్యర్థుల నోటి నుంచే వస్తుండటం గమనార్హం. అదే స్థాయిలో సోషల్‌మీడియా వేదికగా ఆయా పార్టీ అభ్యర్థులపైనా, స్వతంత్రులపైనా వ్యక్తిగత వ్యతిరేక పోస్టులు పెట్టేపనిలో పడ్డారు. ఇక పార్టీ శ్రేణులు, తమ అనుచరులతో ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించిన అభ్యర్థులు.. ఓటర్ లిస్టు పట్టుకుని పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి మరీ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రధాన పార్టీలు రోజువారీ వేతనం ఇస్తూ కొందరిని నియమించుకోవడం గమనార్హం. మరోవైపు ఎన్నికల సంఘం కఠిన నిబంధనల నేపథ్యంలో ఉపాధ్యాయ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు పాఠశాలల్లో కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలపైనే భారం
అధికార పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు సీనియర్ నేతలు బాధ్యతలు తీసుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బాధ్యతలు చూస్తుండగా.. ఎమ్మెల్యేలంతా తమ సెగ్మెంట్లకు పరిమితమయ్యారు. పార్టీ మండలాధ్యక్షులు, శ్రేణులతో నియోజక వర్గాలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. అందులో కరీంనగర్‌కు స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్‌కు సుడా చైర్మెన్ నరేందర్‌రెడ్డి, బోథ్ నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేష్, పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌కు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల్లో సందడి..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉదయం 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ఓటర్లను వారి ఇంటి వద్ద కలుస్తూ తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రత్యర్థి సంఘాల నాయకులు తమ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని అభ్యర్థిస్తున్నారు. పట్టభద్రులతో పోల్చితే ఉపాధ్యాయుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. పీఆర్‌టీయూ నుంచి పోటీచేస్తున్న వంగ మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి పోటీచేస్తున్న కొమురయ్య, టీపీటీఎఫ్, టీఎస్‌యూటీఎఫ్, ఎస్సీ ఎస్టీ యూఎస్ మద్దతుతో పోటీచేస్తున్న అశోక్‌కుమార్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో సంఘం కార్యాలయాలు, ఇతర చోట్ల సమావేశాలు నిర్వహిస్తూ విజయం సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు.
బీజేపీలో అన్నీ తానై.. కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమై..
బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తరుపున బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు అన్నీ తానై ప్రచార బాధ్యతలు తనపై వేసుకున్నారు. ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పార్టీ మండలాధ్యక్షులతో సమావేశమయ్యారు. వివిధ సంఘాలు, పార్టీ శ్రేణులతో ప్రయివేటు ఫంక్షన్‌హాళ్ల వేదికగా సభలు నిర్వహిస్తూ వస్తు న్నారు.ఈ సమావేశాల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్‌పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అభ్యర్థి గెలుపు, ఎమ్మెల్సీగా గెలిస్తే తమ పార్టీ పాత్రపై అంశాలు ప్రజల్లోకి వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి.