శతాబ్దికే అతి పెద్ద జోక్‌

– కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ వ్యాఖ్యలపై
– మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణకు ఆర్థిక స్థోమతలేనందుకే కేంద్రం నుంచి రుణాలివ్వట్లేదంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆర్కే సింగ్‌ వ్యాఖ్యలు శతాబ్ది కాలంలోనే అతిపెద్ద జోక్‌ అని కొట్టిపడేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఎస్‌ జెన్కో కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తీసుకున్న రుణాలుతిరిగి చెల్లించడంలో దేశంలోనే ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, ఇచ్చే ఆర్డిక సంస్థలను భయపెడుతున్నది దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పలేదని ఆర్కేసింగ్‌ అనటం పచ్చి అబద్ధమన్నారు. మీటర్లు పెట్టనందుకే నిధులు ఆపుతున్నామని కేంద్ర ప్రభుత్వం పంపిన ఉత్తరాలను ఎన్నోసార్లు ప్రజల ముందు ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కరెంట్‌ కోతలే లేవన్నది పచ్చి అబద్ధమన్నారు. రాత్రిపూట కరెంటు వాడితే సర్‌ ఛార్జ్‌ విధిస్తామని కేంద్ర మంత్రి హౌదాలో ఆర్కేసింగ్‌ చేసిన వ్యాఖ్యలు నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంస్థకైనా ఎక్కడ పేమెంట్‌ ఆలస్యమైందో ఆర్కే సింగ్‌ చూపించాలని సవాల్‌ విసిరారు.

Spread the love