పెండ్లయి ఓ కుటుంబం ఏర్పడితే చాలు… చాలా మంది మహిళలు ఇక అదే ప్రపంచమను కుంటారు. తమ గురించి తామే మర్చిపోతుంటారు. కానీ శ్రీదేవి పి రెడ్డి అలా కాదు. చిన్నతనంలో పెండ్లి చేసుకున్నా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకున్నారు. దాని కోసం అహర్నిశలూ శ్రమించారు. కుటుంబ సహకారం తీసుకున్నారు. ఇప్పుడు జితారా పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సంస్థనే స్థాపించారు. తన సంస్థ ద్వారా రిటైల్ రంగానికి అవసరమైన టెక్నాలజీని అందిస్తున్న ఆమె పరిచయం…
మా సొంతూరు వరంగల్. అమ్మ లక్ష్మీదేవి, నాన్న జనార్ధన్‌రెడ్డి. అమ్మ హౌమ్ మేకర్, నాన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. నా స్కూలింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే జరిగింది. ఇంటర్‌లో ఉన్నప్పుడు పెండ్లి చేయాలనుకున్నారు. అయితే చదువుకు మాత్రం నాన్న అడ్డు చెప్పలేదు. అత్తగారింట్లో నా చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి పెండ్లి చేసుకున్నాను. పెండ్లి తర్వాత యుఎస్ వెళ్ళి అక్కడే ఎంబీఏ చేశాను. వెంటనే బాబు పుట్టాడు. బాబును అమ్మనే చూసుకుంది. దాంతో నా చదువుకు అస్సలు ఇబ్బంది కలగలేదు.
రిటైల్ బిజినెస్ అంటే ఇష్టం
చదువు అయిపోయిన వెంటనే యుఎస్‌లోనే ఉద్యోగం చేశాను. నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. ఎప్పుడూ జాబ్ చేస్తూనే ఉన్నాను. ఈ విషయంలో నాన్న నాకు స్ఫూర్తి. మనం ఎప్పుడూ ఆడియన్స్‌లో కాదు స్టేజ్‌పై ఉండాలి అనేవారు. ఆ మాటలు ఎప్పుడూ నా మెదడులో తిరుగుతూనే ఉంటాయి. అందుకే ఒకరిపై ఆధారపడకుండా సొంతగా బతకడం నేర్చుకున్నాను. రిటైల్ బిజినెస్ అంటే నాకు మొదటి నుండి బాగా ఇష్టం. ఎందుకంటే మన దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే అతి పెద్ద రంగం ఇది. అలాగే పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఇదే. అందుకే దీనిపై పని చేయాలని నా కోరిక. అయితే వీరికి సరైన టెక్నాలజీ అందుబాటులో ఉండదు. వారికి కావల్సిన టెక్నాలజీ మేము అందిస్తున్నాం. యుఎస్‌లో ఉన్నప్పుడే రిటైల్‌కి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ చేశాను. అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఈ బిజినెస్‌లో సాఫ్ట్‌వేర్ సమస్య ఉందని గ్రహించాను.
సాఫ్ట్‌వేర్ సొల్యూషన్
కరోనా కంటే ముందు నేను లండన్‌కు చెందిన జిరాక్స్ అనే కంపెనీ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాను. అదే వర్క్ ఇండియా వచ్చి చేసుకోవచ్చు కదా అని ఇక్కడికి వచ్చేశాను. ఇండియా వచ్చిన తర్వాత మన దేశంలో రిటైల్ రంగం ఎదుర్కొంటున్న సాఫ్ట్‌వేర్ సమస్య చూసి నేనే సొంతంగా ఎందుకు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ పెట్టకూడదు అనుకున్నాను. బాబు కూడా పెద్దవాడై యుఎస్‌లో చదువుకుంటున్నాడు. అందుకే సొంత బిజినెస్‌పై దృష్టి పెట్టాలనుకున్నాను. మా వారు కూడా యుఎస్‌లోనే జాబ్ చేస్తున్నారు. ఆయన యుఎస్‌కు ఇండియాకు తిరుగుతుంటారు.
జితారా స్థాపించి
కరోనా తర్వాత ఆఫ్‌లైన్ రిటైల్ బిజినెస్ పడుతున్న ఇబ్బందులు చూశాను. కరోనా వల్ల షాపులకు కష్టమర్లు రావడం తగ్గిపోయింది. మరీ చిన్న కిరాణా షాపులు కాకుండా అలా అని మరీ పెద్ద కార్పొరేట్ షాపింగ్ మాల్స్ కాకుండా మధ్యస్తంగా ఉండే రిటైల్ బిజినెస్ చేసే వారి సమస్యలను చూశాను. ఉదాహరణకు క్యూమార్ట్ వంటివి. ఇవి కార్పొరేట్ సంస్థలు కాకపోయినా ఏడాది టర్నోవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీరి వద్ద వారి కష్టమర్ల డేటా వుండదు. అదే కార్పొరేట్ సంస్థల వాళ్ళయితే కష్టమర్ల డేటాను బాగా ఫాలో అవుతారు. రకరకాల ఆఫర్లు పెట్టి కష్టమర్లను ఆకర్షిస్తుంటారు. ఇలాంటి పని చిన్న సంస్థల వారు చేయలేకపోతున్నారు. దాంతో కష్టమర్లు పెద్దగా రావడం లేదు. ఇలాంటి సమస్యలు పరిష్కరించడం కోసమే నేను నా కో ఫౌండర్ వరుణ్ కర్షప్‌తో కలిసి జితారా అనే సంస్థను స్థాపించాను.
దేశ వ్యాప్తంగా విస్తరించాలి
సరైన టెక్నాలజీ అందుబాటులో లేని ఇలాంటి సంస్థలు మన దేశంలో సుమారు 20 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో కనీసం 20 శాతం మంది వద్దకైనా మా సాఫ్ట్‌వేర్ వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకున్నాం. ప్రస్తుతం 250 మంది మా సాఫ్ట్‌వేర్ ఉపయోగించు కుంటున్నారు. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే కొంత వరకు బెంగుళూరులో ఉన్నారు. భవిష్యత్‌లో మా సాఫ్ట్‌వేర్ దేశ వ్యాప్తంగా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాము. మా ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంది. సుమారు 17 మంది ఉద్యోగులు మా వద్దర పని చేస్తున్నారు.
ప్రపంచాన్ని అధ్యయనం చేయాలి
మహిళలు ఏదైనా చేయాలంటే ముందు ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారో లేదో అని అనుమానాలు పెట్టుకుంటారు. పర్మిషన్ ఇస్తారో లేదే అని చెప్పడానికే భయపడతారు. కానీ నేనేమంటానంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో అది కచ్చితంగా చేయాలి. చిన్నప్పటి నుండి ఆడపిల్లలు భయపడడం, ఎవరో ఒకరిపై ఆధారపడి ఉండేలా పెంచుతారు. దాని వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కానీ మనం పెరిగే క్రమంలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అధ్యయనం చేయాలి. మనకేం కావాలో, ఏది మంచిదో నిర్ణయించుకోగలగాలి. అప్పుడే మహిళలు ఏ రంగంలో అయినా విజయం సాధించగలరు. ఇది నా అనుభవంతో చెబుతున్న మాట.
కష్టమర్లను ఆకర్షించేలా…
సంస్థలకు కష్టమర్ల డేటా అందించేందుకు యూపీఏ సొల్యూషన్ ఉపయోగించు కుంటున్నాం. అందరూ యూపీఏ ఉపయోగించి షాపుల్లో అమౌంట్ పే చేస్తారు. దానికి మేము ఒక డాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తాం. అంటే ఆ కష్టమర్ వివరాలు అందులో రికార్డ్ అవుతాయి. అలా వాళ్లు ఎన్ని సార్లు ఆ షాప్‌కు వస్తే అన్ని సార్లు వాళ్ల వివరాలు రికార్డ్ అవుతుంది. పది వేల మంది కష్టమర్లు ఉంటే వారు ఎన్ని సార్లు వస్తున్నారు, ఎంత కొంటున్నారు అనే డేటా మొత్తం ఉంటుంది. అలాగే కొంత మంది ఒకే సారి వస్తారు, కొంత మంది వస్తారు కానీ ఏమీ కొనరు. ఊరికే చూసి వెళ్ళిపోతారు. ఇలాంటివి ఎక్కువ జ్యూలరీ షాపుల్లో జరుగుతాయి. అయితే ఆఫర్ మెసేలు మాత్రం అందరికీ ఒకటే పంపిస్తారు. వాటికి స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కాకుండా కష్టమర్ల అవసరాలు, కొనుగోలును చూసి వారి అవసరాలకు అనుగుణంగా ఆఫర్లను వాళ్ళకు మెసేజ్ రూపంలో పంపేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. అలాంటి సాఫ్ట్‌వేర్ మేము క్రియేట్ చేసి షాప్స్ వారికి అందిస్తున్నాం. కష్టమర్లు వెనక్కు వెళ్లకుండా ఆకర్షించడం ఎలా అనే దానికి మా జితారా పరిష్కారం చూపుతుంది.
– సలీమ