రైతులకు ఆమె ఆపన్న హస్తం

ఇంటిని తీర్చిదిద్దడంతో పాటు సమాజాన్ని ఆర్ధికంగా, సాంస్కృతికంగా బలపరచడంలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనది. మహిళల మేధోపరమైన భాగస్వామ్యం లేనిదే ఏ దేశమూ, ఏ జాతీ ముందడుగు వేయలేదు. నేడు అన్ని రంగాల్లో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో మహిళలు సమర్ధతతో, సమయస్ఫూర్తితో అగ్రగామిగా నిలుస్తున్నారు. అటువంటి క్రియాశీలక మహిళల్లో ఒకరు లేబూరి శారద. సుగంధ ద్రవాలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేస్తున్న ఆమె గురించి మరిన్ని వివరాలు…
ముప్ఫై రెండేండ్లకే భర్తను కోల్పోయారు శారద. అయినా గుండె దిటవు చేసుకుని, పిల్లలిద్దరినీ చదివించి ప్రయోజకుల్ని చేసారు. తాను చదువుకున్న వ్యవసాయ విజ్ఞాన శాస్త్రాన్ని సద్వినియోగ పరుచుకుని తోటి మహిళలకు నూతన సేద్యపు పద్ధతులను వివరిస్తున్నారు. వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాదు ఫ్రాన్స్‌లో ఉన్నత చదువు చదువుకుని సహజ సుగంధ ద్రవ్య వినియోగాన్ని తిరిగి అమలుల్లోకి తేవాలనే ఆశతో’ ESPERANZAU అనే సంస్థను ప్రారంభించారు. మన దేశంలో యుగయుగాలుగా ప్రజల జీవనశైలిలో ఒక అంతర్భాగంగా విలసిల్లిన సహజ సుగంధ తైలపు వాడకాన్ని తిరిగి అమలులోకి తెచ్చి ప్రజలకు అవి ఉపయోగపడేలా చేయాలనే ఆమె ఈ కంపెనీ ప్రారంభించారు. భారత కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో 2017లో దీన్ని స్థాపించారు. ఆమె ఆశించిన విధంగానే ప్రజలు కూడా దీన్ని స్వాగతించారు.
నిర్విరామ కృషితో…
ఈ’ ESPERANZAU నేచురల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కుటుంబ యాజమాన్యంలోని సంస్థ. వీరు వినియోగదారులకు ఉత్తమమైన ఉత్పత్తులను ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. విస్తారమైన అంతర్జాతీయ వ్యవసాయ, వ్యాపార అనుభవం కలిగి ఉన్న ఉత్సాహవంతులైన, నిబద్ధత కలిగిన వ్యవసాయ పట్టభద్రుల సమూహం ఇది. సుగంధ ద్రవ్యాల మొక్కల కోసం విత్తనాలు నాటడం, సేద్యం చేయడం, పంట చేతికొచ్చాక నూనెతీయడం, ప్యాకెట్లు చేసి చివరికి ఉత్పత్తులను హోల్సేల్‌, రిటైల్‌ షాపులకివ్వడం దీని పని. ఈ సంస్ధ చేస్తున్న నిర్విరామ కృషితో పంట పండించే రైతులకు గొప్ప ఆత్మ విశ్వాసం కలుగుతోంది. వినియోగదారులు ప్రకృతి అందించే సుగంధ ద్రవ్యాలను సక్రమంగా ఉపయోగించుకోవడంలో అవగాహన కల్పిస్తున్నది.
జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ…
లెస్పరేంజా నేచురల్‌ ఆయిల్స్‌ సంస్థ స్వచ్ఛమైన, అత్యవసర నూనెలను (essential oils) ఉత్పత్తి చేసే సంస్థల్లో కెల్లా ప్రామాణిక మైనది. ఈ సంస్థ తయారుచేయించే సుగంధ తైలం నాణ్యతలో పేరెన్నిక గన్నది. ఈ సంస్థ అందించే సువాసనాభరిత నూనెలు ప్రజలకు మానసికోల్లాసాన్ని, మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వ్యవసాయ కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన శారద తన సంస్థ ద్వారా రైతులకు ఎంతో సేవ చేస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను పండించేలా అన్నదాతలకు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారు.
సంస్థ చేసే పనులు
నిమ్మగడ్డి, పామ్రోజ్‌, జాస్మిన్‌, యూకలిప్టస్‌ వంటి సుగంధ తైలాల సహజ సేంద్రీయ వ్యవసాయం చెయ్యడం మొదలుకొని ఆ మొక్కల నుంచి స్వచ్ఛమైన, సహజమైన, అత్యంత ఆవశ్యక సుగంధ తైలాలను తియ్యడం వరకు అన్ని దశల్లోనూ సన్నకారు రైతులకు సహాయ సహకారాలందిస్తుంది. అలాగే దేశ వ్యాప్తంగా ఔత్సాహికులు ముఖ్యంగా మహిళారైతులను ఆహ్వానించి, వారికి ఆధునిక సహజ సేంద్రీయ పద్ధతుల్లో, లాభసాటి వ్యాపార విధానాల్లో శిక్షణనిచ్చి, వారు స్వయంప్రతిపత్తిని సాధించేలా కృషి చేస్తున్నారు. దీని కోసం వి హబ్‌ వారి సహాయసహకారాలు తీసుకుంటున్నారు. సుగంధ తైలాలను ఉపయోగించి వివిధ వస్తువులను అంటే ఉదాహరణకు సబ్బులు, సెంట్లు, తలనూనెలు, షాంపూలు తయారు చేయడంలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.
రైతులను ఎంపిక చేసి
ప్రస్తుతం ఈ సంస్థ ఇరవై ఐదు రకాల తైలాలను, పది రకాల కెరీర్‌ ఆయిల్‌ను, ఐదు రకాల సబ్బులను, మూడు రకాల ఉద్యానవన జలాలను, మూడు రకాల స్నానపు ఉప్పు కణికలనూ తయారుచేస్తోంది. ఈ సుగంధ తైలాల ఆధారంగా ప్రీమియమ్‌ ఎఫ్‌.ఎమ్‌.సి గుడ్స్‌ మొదలుపెట్టి ఉత్పత్తులను పెంపొందించే ఆలోచన చేస్తోంది. కొంతమంది రైతులను ఎంపిక చేసుకుని వారు ఆరువందల ఎకరాల్లో పండించే సుగంధ ద్రవ్యాలను కొనే పద్ధతిలో పండిస్తోంది. అంతేకాకుండా భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో ‘అవగాహన జ్ఞాపిక’ (మెమొరీ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌)ను ఏర్పరచుకొని, భవిష్యత్తులో తమ ఉత్పత్తుల ఎగుమతుల గురించి కూడా ప్రణాళికలు వేస్తోంది.
వ్యాపార విజయాలు
జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సత్సంబంధాలు నెరుపుతూ మంచి గుర్తింపును పొందుతున్నారు. ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇన్స్టాగ్రామ్‌, గూగుల్‌ మొదలైన సమాచార సాధనాల ద్వారా తమ సుగంధ తైలాల క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఆర్గానిక్‌ దుకాణాల్లో వీరి ఉత్పత్తులు మనకు కనిపిస్తాయి. వీరి సుగంధ తైలాలు చర్మ, జుట్టు సమస్యలు, కండరాల నొప్పులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడుల వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ప్రజలకు ఇన్ని రకాల ప్రయోజనాలు అందిస్తున్న ఈ సంస్థకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందాయి.

Spread the love