ముసురేసింది

– 987 ప్రాంతాల్లో వర్షపాతం
– ఈ స్థాయిలో ఈ ఏడాది ఇదే తొలిసారి
– వచ్చే మూడు రోజులూ మోస్తరు నుంచి భారీ వర్షాలు
– కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం
– కొన్ని జిల్లాలకు రెడ్‌, పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రమంతటా మంగళవారం ముసురేసింది. ఉదయం నుంచి రాత్రి 10:30 గంటల వరకు 987 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఒకేరోజు ఇన్ని ప్రాంతాల్లో వర్షం కురవడం ఈ ఏడాది ఇదే తొలిసారి కావడం గమనార్హం. 418 ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురువగా, దక్షిణ తెలంగాణ అంతటా ఉదయం నుంచి జల్లులు పడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట అతిభారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న హెచ్చరించారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో కొన్ని ప్రదేశాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల జాబితాలో పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌ ఉన్నాయి. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆకాశం మేఘావృతమై ఉంది. చాలా చోట్ల పొద్దస్తమానం చిరుజల్లులు పడ్డాయి.

Spread the love