ఆ గ్రామానికి ఆమె మొదటి సర్పంచ్‌

అది మహారాష్ట్రలోని గాడ్చిరోలి అనే మారుమూల గ్రామం. పదహారేండ్లుగా ఆ గ్రామానికి సర్పంచ్‌ లేరు. అలాంటి చోట ప్రజలు 24 ఏండ్ల యువతిని మొదటి సారి తమ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహారాష్ట్రలోని నక్సల్‌ ప్రభావిత ప్రాంతం అది. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గిరిజనుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నది. బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువులో వారిని ప్రోత్సహించేందుకు, స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు విరామమెరుగక శ్రమిస్తుంది. ఆమే భాగ్యశ్రీ మనోహర్‌ లేఖమి. ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని భామ్రాగఢ్‌ తహసీల్‌ గ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. ప్రజారోగ్య కేంద్రాలలో వైద్యులు చాలా అరుదుగా కనిపిస్తారు. గిరిజన పురుషులు నక్సల్స్‌ పేరుతో ఏండ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారు. అలాంటి ప్రాంతంలో ప్రతిరోజు కోటి అనే తన గ్రామం నుంచి సర్పంచ్‌ భాగ్యశ్రీ ఉదయం టీ తాగేసి అక్కడి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రణాళికతో తన మోటార్‌సైకిల్‌పై బయలుదేరుతుంది. తన పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో ఒక గ్రామాన్ని ఎంచుకుని ఆ రోజంతా వారితోనే ఉండిపోతుంది. తన ఆలోచనలు మాత్రమే కాదు తన భోజనం కూడా ఆ రోజు ఆ గ్రామ ప్రజలతోనే.
నక్సల్‌ ప్రాంతమనీ…
విద్యుత్‌ సరఫరా కోసం అక్కడి ఎలక్ట్రిక్‌ మీటర్ల స్థితిని తనిఖీ చేయించడం, మరుగుదొడ్లు, పక్కా గృహాల నిర్మాణంతో పాటు బాల్య వివాహాలను ఆపడం, వారు మళ్ళీ బడికి వెళ్ళి చదువుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ఆమె లక్ష్యం. భాగ్యశ్రీ నివసించే కోటి గ్రామ పంచాయతీకి 2003 నుండి సర్పంచ్‌ లేరు. ఎందుకంటే నక్సల్స్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో పని చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. భాగ్యశ్రీ తల్లి అంగన్‌వాడీ టీచర్‌, తండ్రి తహసీల్‌ స్థాయి టీచర్‌. వీరు అధికారిక పత్రాల కోసం దరఖాస్తు చేయడం, రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌లు నింపడం, బ్యాంక్‌ ఖాతాలు తెరవడంలో గ్రామస్తులకు సహకరిస్తుంటారు.
గ్రామాన్ని మార్చుకోవడానికి
2019లో పంచాయితీలో చదువు పూర్తి చేసిన అతికొద్ది మంది బాలికలలో భాగ్యశ్రీ ఒకరు. మాదియా గిరిజన సంఘం (ఈ ప్రాంతంలోని జనాభాలో ఆధిపత్యం చెలాయిస్తుంది) ద్వారా స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలా భాగ్యశ్రీ ఆ గ్రామానికి మొదటి సర్పంచ్‌గా చరిత్ర సృష్టించారు. అప్పుడు ఆమె వయసు 20 ఏండ్లు. ఆమె వాలీబాల్‌ ఛాంపియన్‌ కూడా. ‘వాస్తవానికి నేను అథ్లెట్‌ కావాలని కోరుకున్నాను. కానీ నాకు 20 ఏండ్లు వచ్చే వరకు మా ఇంట్లో కరెంటు లేదు. ఆదివాసీలుగా మాకు ఏ ప్రభుత్వ ప్రాధాన్యతా లేదు. మా గ్రామాన్ని మార్చుకోవడానికి నేను ఈ బాధ్యతను ఒక అవకాశంగా భావించాను’ అంటున్నారు ఆమె.
రోజువారీ సవాలు
సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భాగ్యశ్రీ ప్రతి రోజూ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేది. ‘చిన్నప్పుడు నేను రోజంతా ఆరు బయట ఆడుకునే దాన్ని. నాకు కావలసినవి ధరించేదాన్ని. నన్ను నా తల్లిదండ్రులు కొడుకులా పెంచారు. కానీ మొదటిసారిగా గ్రామ సర్పంచ్‌గా ఉన్న నన్ను కొందరు అనుచితంగా తాకడానికి, ఎగతాళి చేయడానికి ప్రయత్నించే వారు. అక్కడ ఎవరినీ ఏమీ అనేదాన్ని కాదు. ఇంటికి వచ్చి మా అమ్మకు చెప్పుకుని ఏడ్చేదాన్ని. అయితే బయట పరిస్థితులకు అనుగుణంగా మారాలని మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. అప్పుడు నేను బయట బిగ్గరగా, నమ్మకంతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’ అంటూ ఆమె అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు.
అది నా బాధ్యత
ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థులకు భాగ్యశ్రీ సహాయం చేస్తున్నారు. అలాగే తనకు సమయం దొరికినప్పుడు రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రాథమిక వనరులను పొందడం గిరిజన సమాజానికి ఒక పెద్ద పనిగా నేను చూస్తున్నాను. ఈ పనులేమీ అక్కడ ఆగకుండా చూడడం నా బాధ్యత. తలపెట్టిన పనులేమీ మధ్యలోనే ఆగిపోకుండా పట్టుదలతో కృష్టి చేస్తున్నాము’ అని ఆమె అంటున్నారు. విద్యుత్‌ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న గ్రామాలు విద్యుత్‌ సరఫరా కోసం ఆరు నెలలు వేచి ఉన్నాయి. అలాంటి ఈరోజు ఆమె పరిధిలోని తొమ్మిది గ్రామాలలో ఆరు గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం ఉంది. 150 కంటే ఎక్కువ కచ్చా ఇళ్లు పక్కా గృహాలుగా పునర్నిర్మించబడ్డాయి. నీటి సరఫరాతో మరుగుదొడ్లు కూడా ఉన్నాయి.
ఇప్పుడు మార్పు వచ్చింది
తమ పంచాయతీలోని ప్రజారోగ్య కేంద్రాలను వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో వర్షాకాలం తర్వాత చిన్నారుల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ‘మా గ్రామాలకు వచ్చి వైద్య సేవలు అందించేందుకు వైద్యులు రోడ్లు, విద్యుత్‌ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కోరుతున్నారు. కానీ మా కమ్యూనిటీ పట్ల విపరీతమైన వివక్ష ఉంది. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. పాఠశాలలు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయి. గ్రామంలో చాలా రోజులుగా పని చేస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు మా నాన్న. ఎవరూ ఇక్కడ పని చేయాలనుకోరు. దీనికి నక్సలిజాన్ని ఓ కారణంగా చూపేవారు. ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారింది. నేను నా ప్రజల కోసం నిలబడినందుకు సంతోషంగా ఉంది. సమస్యలను పరిష్కరించుకుంటే మా పరిస్థితులను మార్చుకోవచ్చని నేను తెలుసుకున్నాను. ఆ మార్పు పూర్తిగా వచ్చే వరకు నేను నా ప్రయత్నాలను ఆపను’ అంటూ భాగ్యశ్రీ తన మాటలు ముగించారు.

బాల్య వివాహాలు నిర్మూలించేందుకు
చంద్రాపూర్‌లోని రాష్ట్రీయ శారీరక్‌ శిక్షన్‌ మహా విద్యాలయం నుండి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బిఏ చేస్తున్న ఈ యువ నాయకురాలు ఓ మహిళా సర్పంచ్‌గా తనకు వస్తున్న సవాళ్ళను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే వుంది. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో, అనుకున్న లక్ష్యం ఎలా చేరుకోవాలో నేర్చుకుంది. ‘గ్రామస్తులు నాతో, నా ఆలోచనలతో విభేదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వారు ఆడపిల్లలను చదవించడానికి, దాని కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టం పడరు’ అంటున్నారు ఆమె. అందుకే భాగ్యశ్రీ ఓ నిర్ణయం తీసుకున్నారు. బాల్య వివాహాలను తగ్గించేందుకు అమ్మాయిలను తమ గ్రామానికి చాలా దూరంలో ఉన్న చంద్రాపూర్‌లోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పించడం ప్రారంభించింది. ‘వారు సెలవులకు మాత్రమే ఇంటికి వస్తారు. అక్కడ చదువుకుంటూ క్రీడల్లో కూడా రాణిస్తారు. దాంతో వాళ్ళకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో పెండ్లి ఆలోచన కూడా పెద్దగా రాదు’ అంటున్నారు.

Spread the love