మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్‌

– పార్టీని వీడిన సింధియా విధేయుడు
– అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి ఎదురుదెబ్బ
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీజేపీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సన్నిహితుడైన నాయకుడు ప్రమోద్‌ టాండన్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టాండన్‌ సింధియా వీర విధేయుడిగా ఉన్నాడు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సింధియా తిరుగుబాటు చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో బీజేపీలో చేరాడు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మకు రాసిన అధికారిక లేఖలో ప్రమోద్‌ టాండన్‌ తన ప్రాథమిక సభ్యత్వం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రెండింటికీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ”నేను మాధవరావు సింధియాకు సన్నిహితుడిని. నేను జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి బీజేపీలో చేరినప్పుడు మా మధ్య బంధం బలంగానే ఉండేది. గత ఆరు నెలలుగా సింధియాతో నాకు ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదు. బీజేపీ అహంకారం, నియంతృత్వ పోకడల కారణంగా నేను రాజీనామా చేస్తున్నాను” అని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు సుర్జిత్‌ సింగ్‌ చద్దా, తాత్కాలిక అధ్యక్షుడు గోలు అగ్నిహౌత్రితో జరిగిన సమావేశంలో టాండన్‌ చెప్పినట్టు కథనాలు వచ్చాయి.
టాండన్‌తో పాటు మరో బీజేపీ నేత దినేష్‌ మల్హర్‌ కూడా అధికార పార్టీని వీడారు. ఇద్దరు నేతలను కాంగ్రెస్‌ అధినేత కమల్‌నాథ్‌ అధికారిక కార్యక్రమంలో పార్టీలో చేర్చుకునే అవకాశం ఉన్నది. కాగా, ఇప్పటి వరకు ఈ ఇద్దరు నాయకులు ఇండోర్‌లో బీజేపీకి బలాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వీరిద్దరు పార్టీని వీడటం బీజేపీకి పెద్ద షాక్‌ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జ్యోతిరాదిత్య సింధియాకు మరో కీలక మద్దతుదారుడైన సమందర్‌సింగ్‌ పటేల్‌ బీజేపీ నుంచి వైదొలగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. ప్రమోద్‌ టాండన్‌, దినేష్‌ మల్హర్‌ ఇద్దరూ ఈనెల 23న కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కమల్‌ నాథ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, 2020లో రాజకీయ గందరగోళం కారణంగా జ్యోతిరాదిత్య సింధియా, ఆయన 22 మంది విధేయులు బీజేపీకి ఫిరాయించారు. దీంతో, కాంగ్రెస్‌ తన మెజారిటీని కోల్పోయింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.

Spread the love