నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ 115 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టికెట్ దక్కని వారు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఇప్పటికే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. మైనంపల్లి బాటలోనే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం త్వరలో కాంగ్రెస్‌లో చేరనుండగా తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ చేరనున్నారు. తన మద్దతుదారుల నిర్ణయం మేరకే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రాథోడ్ బాపురావు పేరు లేదు. బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉండగా కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో పార్టీని వీడేందుకే సిద్ధమయ్యారు రాథోడ్ బాపురావు.