జిమ్‌లకు వెళ్లేవారికి షాకింగ్ న్యూస్…

నవతెలంగాణ – హైదరాబాద్: మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో పట్టుబడిన మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. 400 వరకూ ఇంజక్షన్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. జిమ్ ట్రైనర్ నితీష్, రాహుల్‌తో పాటు సోహెల్‌లను అరెస్ట్ చేశారు. పట్డుబడ్డ ఇంజక్షన్లను ఎక్కడి నుంచి తెస్తున్నారు? ప్రధాన సూత్రధారి ఎవరు అనే కోణంలో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ ఇంజక్షన్లను ఎక్కువగా జిమ్‌లో బాడీబిల్డర్‌ల కోసం వాడి దుర్వినియోగం చేస్తున్నారని అధికారుల విచారణలో తేలింది. మెఫెంటెర్మైన్ ఇంజక్షన్లను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడటం వల్ల యువతలో సైకోసిస్ లక్షణాలు పెరగటంతో పాటు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇంజక్షన్లను అనుమతి లేకుండా కొంతమంది జిమ్‌లలో కోచ్‌లు జిమ్‌కు వచ్చే యువకులకు ఇస్తున్నారు. తక్కువ కాలంలో మంచి శరీరాకృతి వచ్చి కండలు తిరిగిన శరీరం కనిపించేలా చేస్తామని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా భారీగా అమ్ముతున్న ఈ ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Spread the love