నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపుర్ (Manipur)లో ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లర్లను అరికట్టేందుకు వచ్చిన బీఎస్ఎఫ్ జవానే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. జులై 20న ఇంఫాల్‌లోని ఓ కిరాణా స్టోర్‌కు వచ్చిన మహిళపై అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం జవాను అనుచితంగా ప్రవర్తించాడు. స్టోర్‌లో ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఆమెను అనుసరించాడు. అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంభందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైరల్ అయిన దృశ్యాల ఆధారంగా ఆ జవానును గుర్తించి సస్పెండ్ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న బీఎస్ఎఫ్ నిందితుడిపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది.