నవతెలంగాణ-న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్‌లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏ ఒక్కరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు వ్యక్తులు బైక్‌పై షాపు వద్దకు రాగా ఇద్దరు వ్యక్తులు షాపులోకి దూసుకొచ్చి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ సమయంలో షాపు తెరిచిఉన్నా ఫ్రంట్ గ్లాస్ డోర్స్‌పైకి దుండగులు కాల్పులు జరిపారు. ఘటనా స్ధలం నుంచి పారిపోయే ముందు వారు గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఫైరింగ్‌పై పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. షాపు యజమాని, ఉద్యోగులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.