వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగుచేయాలి

రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వానాకాలంలో స్వల్పకాలిక వరి వంగడాలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సాగు చేయాల్సిన పంటల వివరాలను వెంటనే అందజేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ‘కూనారం సన్నాలు , కూనారం 1638, బతుకమ్మ, వరంగల్‌ 962, ఆర్‌ఎన్‌ఆర్‌ 21278, ఆర్‌ఎన్‌ఆర్‌ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా, ఎంటీయూ 1010, జగిత్యాల 24423, ఐఆర్‌64, హెచ్‌ఎంటీ సోనా’ సాగు చేయాలని సూచించారు.
శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో వాతావరణ పరిస్థితులు, వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, ఆయిల్‌ పామ్‌ సాగుపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు ఆలస్యం అయినందున క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు నాటుకునేలా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యాసంగిలో అకాలవర్షాల నుంచి వరి పంట నష్టపోకుండా రైతులు పంటకాలాన్ని ముందుకు జరుపుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. వరి పంటకాలం ముందుకు జరుపుకునేలా రైతులను చైతన్యం చేస్తూ వ్యవసాయ శాఖ రూపొందించిన వీడియోను విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్‌ హన్మంతు కొండిబ, హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న, సాగునీటి శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌, విత్తన సంస్థ ఎండీ కేశవులు, అడిషనల్‌ డైరెక్టర్‌ విజరు కుమార్‌, ఉద్యాన శాఖ జేడీ సరోజిని తదితరులు ఉన్నారు.

Spread the love